దసరా తర్వాతే విస్తరణ

2 Sep, 2019 01:44 IST|Sakshi

బడ్జెట్‌ సమావేశాలు, గవర్నర్‌ బదిలీ నేపథ్యంలోనే..

భారీ మార్పుచేర్పులు లేకుండానే కసరత్తు

కొత్తగా నలుగురు లేదా ఐదుగురికి అవకాశం

హరీశ్‌ చేరికపై స్పష్టత వస్తేనే విస్తరణ కొలిక్కి?  

సాక్షి, హైదరాబాద్‌ : సుమారు ఆరు నెలలుగా ఆశావహులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం దసరా తర్వాతే కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్‌ బదిలీ, బడ్జెట్‌ సమావేశాలు, బతుకమ్మ పండుగ తదితరాలు వరుసగా వస్తుండటంతో పండుగ తర్వాతే విస్తరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పెద్దగా మార్పుచేర్పులు లేకుండా మరో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మంత్రివర్గంలో సామాజికవర్గాల సమ తౌల్యత పాటిస్తూ మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభమై మూడో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్థానంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. కొత్త గవర్నర్‌ బాధ్యతలు స్వీకరించే తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లోగా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

కేటీఆర్, హరీశ్‌ బెర్తులపైనే ఆసక్తి.. 
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావుకు తిరిగి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా కొంత స్పష్టత రావాల్సి ఉంది. కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఇప్పటికే కేబినెట్‌ హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. అదే సామాజికవర్గం నుంచి ఇప్పటికే సీఎం కేసీఆర్‌తోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే హరీశ్‌రావుకు చోటు కల్పించకుండా తాను ఒక్కడినే మంత్రివర్గంలో చేరితో విమర్శలు వస్తాయనే భావన కేటీఆర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ వద్ద కూడా కేటీఆర్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో మంత్రివర్గంలో హరీశ్‌రావు చేరిక అంశం కొలిక్కి వస్తేనే విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే దసరా తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌కు బెర్తులు ఖాయమైనట్లు సమాచారం. కాగా, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ శనివారం తన కుమార్తె, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితతో కలసి కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

మరిన్ని వార్తలు