రేపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం

9 Feb, 2019 01:29 IST|Sakshi

వసంత పంచమికే సీఎం కేసీఆర్‌ మొగ్గు

ఇప్పుడు కాకుంటే 24న జరిగే చాన్స్‌..

ఆరుగురు లేదా ఎనిమిది మందికి అవకాశం 

ఉమ్మడి జిల్లాల లెక్క తీసుకుంటే 10మందికి చోటు

ఆశావహుల్లో ఉత్కంఠ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూ ర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. వసంత పంచమి అయిన ఆదివారం ఈ కార్యక్రమం జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం. త్వరలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనుండటం, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటం వంటి కారణాల నేపథ్యంలో పాక్షికంగానైనా కేబినెట్‌ విస్తరించాలని సీఎం భావిస్తున్నారు. ఈనెల 20 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్న కేసీఆర్‌.. ఆ ఎన్నికల్లో పార్టీని సమన్వయం చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా జిల్లాకు ఒక్కరినైనా తీసుకోవా లని నిర్ణయిస్తే.. గరిష్టంగా పది మంది వరకు ఈ విడతలో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రస్తుతం వసంత పంచమి ఒక్కటే మంచిరోజు ఉంది. దీంతో ఆ రోజుకే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఏవైనా కారణాలతో ఇప్పుడు విస్తరణ జరపకపోతే, ఈ నెల 24వ తేదీని పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

జాబితా.. చాంతాడంత.. : అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ 88 స్థానాలు గెలుచుకుని భారీ విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. వీరిలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచినవారు చాలామందే ఉన్నారు. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్నవారి జాబితా సైతం భారీగానే ఉంది. ఒక్కో ఉమ్మడి జిల్లాలకు సగటున ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోరుతున్నారు. అయితే, సీఎం మాత్రం ఉమ్మడి జిల్లా, సామాజిక సమీకరణ లెక్కల ఆధారంగా తన జట్టును ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘కేబినెట్‌లో ఎవరు ఉండాలనే విషయంపై ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్‌ స్పష్టతకు వచ్చారు. అయితే విస్తరణ ఎప్పుడనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టకుండా ఉంది’అని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ముఖ్యలు చెబుతున్నారు. 

స్వల్పమార్పులు జరిగే ఛాన్స్‌.. 
రాజ్యాంగ నిబంధనలన ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో సీఎంతో కలిపి 18 మంది ఉంటారు. టీఆర్‌ఎస్‌ గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒక్కొక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. అయితే, కొత్త మంత్రివర్గ కూర్పులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హాయంలో బీసీ వర్గానికి శాసనసభ స్పీకర్‌ పదవి ఇవ్వగా.. ఈసారి ఓసీ వర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఓసీల సంఖ్య ఒకటి తగ్గి ఈ మేరకు బీసీల సంఖ్య పెరగనుందని తెలుస్తోంది. ఇప్పడు చేపట్టే విస్తరణలో మాత్రం ఓసీ, బీసీ వర్గాలకు సమాన సంఖ్యలో పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే మహిళకు కూడా ఈసారి చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్యెల్యేలుగా ఎన్నికైన పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, అజ్మీరా రేఖానాయక్‌లతోపాటు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ ఆకుల లలితల్లో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. 

ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవుల ఆశావహులు... 
ఆదిలాబాద్‌: జోగు రామన్న, అజ్మీరా రేఖానాయక్, కోనేరు కోనప్ప 
నిజామాబాద్‌: వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఆకుల లలిత 
కరీంనగర్‌: ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ 
మెదక్‌: తన్నీరు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి 
రంగారెడ్డి: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌గౌడ్, అరికెపూడి గాంధీ 
హైదరాబాద్‌: తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, దానం నాగేందర్‌ 
మహబూబ్‌నగర్‌: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, పి.నరేందర్‌రెడ్డి 
నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీత, ఆర్‌.రవీంద్రనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి 
వరంగల్‌: ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి/అరూరి రమేశ్, డి.ఎస్‌.రెడ్యానాయక్‌ 
ఖమ్మం: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌  

మరిన్ని వార్తలు