ఉద్యోగులకు దసరా కానుక?

1 Oct, 2019 03:00 IST|Sakshi

నేడు ప్రగతి భవన్‌లో కేబినెట్‌ కీలక భేటీ

పీఆర్సీ, రిటైర్మెంట్‌ వయసు పెంపుపై నిర్ణయం?

ఆర్టీసీ సమ్మె యోచన విరమణకు చర్యలు.. 

కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయం!

కొత్త సచివాలయ డిజైన్‌కు ఆమోదం!

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్ష తన రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశమై పలు కీలక నిర్ణ యాలు తీసుకోనుంది. రానున్న దసరా పండుగ కానుకగా పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు తీపి కబురు వినిపించాలని సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం తలపెట్టినట్లు చర్చ జరుగుతోంది.

పీఆర్సీ కోసం నిరీక్షణ...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలి కంగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్సీ అమలు, ఉద్యోగ విరమణ వయో పరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం కారణంగా ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా అసంతృప్తి తెలియజేస్తూ వస్తున్నాయి. పీఆర్సీ విషయంలో ఇంకా ఆలస్యం చేయవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుచేయాలా? ఎంత శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిం చాలి? అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో మధ్యంతర భృతి ప్రకటించబోమని, నేరుగా పీఆర్సీ వర్తింపజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా పీఆర్సీ విషయంలో ఏదైనా ప్రకటన చేయవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఉద్యోగులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయంలో సైతం మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. వచ్చే నెల 5 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటిసులు జారీ చేసిన నేపథ్యంలో సమ్మె యోచన విరమణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గం నిర్ణయించనుందని తెలిసింది. 

నదుల అనుసంధానం ప్రదిపాదనలపై చర్చ...
కృష్ణా–గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రైతాంగానికి సాగునీటిని సరఫరా చేయాలన్న ప్రతిపాదనలపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం దిశగా సాగుతున్న చర్చల పురోగతిని సైతం మంత్రివర్గ భేటీలో సమీక్షించనున్నారని తెలిసింది. 

అలాగే కొత్త సచివాయ భవన సముదాయ నిర్మాణం అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై చర్చించి ఈ సమావేశంలో ఆమోదించనున్నారని సమాచారం. అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కొత్త సచివాలయం డిజైన్‌ను సైతం ఈ సమావేశంలో ఆమోదించనుంది. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త ఎక్సైజ్‌ పాలసీలను మంత్రివర్గం ఆమోదించనుందని తెలిసింది. 

మరిన్ని వార్తలు