లాక్‌డౌన్‌: సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

2 May, 2020 10:41 IST|Sakshi

ఈ నెల 5న మంత్రివర్గం సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 17 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రకటించిన విధంగా ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఆంక్షల నుంచి సడలింపులు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, చికిత్స, తాజా పరిస్థితులతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 5న ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశమై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. (దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లు)

కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. మరోవైపు తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రజా రవాణతో పాటు మద్యం దుకాణాలు తెరవడం అనేది కీలకంగా మారింది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం మద్యం అమ్మకాలకు అప్పుడే అనుమతులు ఇవ్వకపోవచ్చు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. బస్సులు నడపడం, మద్యం అమ్మకాలకు సామాజిక దూరం అనేది ఖచ్చితమైన నేపథ్యంలో అది కష్టతరమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది.

దీంతో స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా అంటురోగాల నియంత్రణ చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాల ప్రకారం సడలింపులతో నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం  రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని సీఎం కేసీఆర్‌ ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో లాక్‌డౌన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. (లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇక అంతే)

మరిన్ని వార్తలు