మంత్రివర్గ విస్తరణ: ముహూర్తం కుదిరేనా? 

20 Dec, 2018 00:59 IST|Sakshi

మంత్రివర్గ విస్తరణపై వీడని సందిగ్ధత 

జనవరి 4 వరకే మంచి రోజులు 

అవి దాటితే మళ్లీ ఫిబ్రవరి 7 తర్వాతే అవకాశం

ఆశావహుల్లో టెన్షన్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా ఈ వ్యవహారంపై ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్‌ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఉంటే ఎప్పుడు? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడదు.  

కాంగ్రెస్‌ నుంచి చేరికలున్నాయా? 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకుని భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టింది. ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ బలం 90కి చేరింది. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి చేరికల తర్వాత ఉండే జిల్లాల సమీకరణాల ఆధారంగా కేబినెట్‌ కూర్పు ఉంటుందని సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌కు రానున్నారు. మూడు రోజుల బస అనంతరం 24న తిరిగి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా పలు కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ బిజీ షెడ్యూల్‌ ఉన్న నేపథ్యంలో డిసెంబర్‌ నెలాఖరులో నాలుగు రోజులు, జనవరి మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయడానికి అనువుగా కనిపిస్తున్నాయి. 

4న పంచాయతీ నోటిఫికేషన్‌? 
హైకోర్టు తీర్పు నేపథ్యంలో జనవరి 10వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జనవరి 4న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఇక అది ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి వీలుండదు. అంటే ఎలా చూసినా, జనవరి 4లోపు మాత్రమే కేబినెట్‌ విస్తరణకు అవకాశం కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ఎలాగూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఉంటాయని, వాటి కోసం అనివార్యంగా కేబినెట్‌ విస్తరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు