దర్యాప్తు ముమ్మరం.. ఒకరి అరెస్టు

2 Feb, 2019 20:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసి దాదాపు 60 పోస్టులపై తీవ్ర అసభ్యకర కామెంట్లు చేసిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో శనివారం అరెస్టు చేశారు. అతడు గుంటూరులోని ఆర్‌వీఆర్‌ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. సొంతూరైన వేములలో తమ కుటుంబానికి రెండెకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని పోలీసుల విచారణలో  వెల్లడించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన వెంకటేశ్వరరావును పోలీసులు ఆదివారం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నారు.  

ఐపీ అడ్రస్‌తో గుర్తించాం: తనపై ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల హైదరాబాద్‌ సీపీకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘‘షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన వెంకటేశ్వరరావును గూగుల్‌ ఇచ్చిన ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌(ఐపీ) అడ్రస్‌ ఆధారాలతో గుర్తించాం. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబ్, వెబ్‌సైట్లలో పోస్టులు పెట్టిన 18 మందికి సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చాం. అందరినీ విచారించాం. చాలా వీడియోలు, పోస్టులకు ఇతడు అసభ్యకర కామెంట్లు పెట్టినట్లు గుర్తించాం’’ అని  ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీసులు తెలిపారు.  

మంచిర్యాల, అదిలాబాద్‌లో.. 
వెంకటేశ్వరరావు మాదిరిగానే షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్లు చేసిన ఇద్దరిని మంచిర్యాల, అదిలాబాద్‌లో  సీసీఎస్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన మూడు వెబ్‌సైట్లలోని పోస్ట్‌ల ఆధారంగా వీరంతా అసభ్యకర కామెంట్లు పెట్టారని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు