చిల్లర రాజకీయాలు బంద్ చేయండి: కేసీఆర్‌

26 Feb, 2018 14:43 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌:  కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి నేరుగా తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు వెళ్లిన కేసీఆర్.. అక్కడి నుంచి అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' చైనా కంటే ఎక్కువ సాగుభూమి మనదేశంలో ఉంది. మనదేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాల అసమర్థత వల్ల రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేశ ప్రజలస్థితిగతులను అర్థం చేసుకోవడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయి. ఆ పార్టీలకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేకుంటే రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది. 

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రధానమంత్రిని 20 సార్లు కోరినా.. స్పందన లేదు. వాస్తవాలు చెబితే నమ్మడం లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతు సదస్సు నుంచి అడుగుతున్నాను. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. మార్చి5 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలు పోరాటం చేస్తారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ పార్టీలు చిల్లర రాజకీయాలు బంద్ చేయాలి. కర్నాటకలో ఎన్నికలప్పుడే గోదావరి కావేరీ అనుసంధానం గుర్తుకు వస్తుంది.

రైతులకు నీళ్లిచ్చే తెలివిలేని మాటలు ఎందుకు. ఏడాది లోగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తై మద్యమానేరుకు నీళ్ళు వస్తాయి. 365 రోజులు ఎస్సారెస్సీ వరదకాలువలో పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఈ యాసంగి నుంచి రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. కల్తీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం మోపుతాం. గతంలో కంటే ఎక్కువగా వచ్చే బడ్జెట్‌లో సాగునీటి రంగానికి నిధులు కేటాయిస్తాం. ఏప్రిల్‌ నుంచి రైతులకు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ జరుగుతుంది. కల్తీ విత్తనాల సరఫరాదారులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తాం' మని కేసీఆర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు