పరుగెత్తే నీటికి నడక నేర్పాలి

15 Jul, 2018 01:27 IST|Sakshi
తెలంగాణ సీఎం కేసీఆర్‌

ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించాలి

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

చెక్‌డ్యామ్‌లతో వర్షపు నీటిని ఒడిసిపట్టాలి.. ఏడాదంతా చెరువులన్నీ నీటితో కళకళలాడాలి

2 నెలల్లో వ్యూహం ఖరారు చేయాలి

ప్రాజెక్టుల కాలువలతో చెరువుల అనుసంధానంపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలతో, వర్షాలతో, పడబాటు (రీ జనరేటెడ్‌)తో వచ్చే నీటితో చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు.

పరుగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. ఏడాదంతా తెలంగాణలోని అన్ని చెరువులూ నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షించారు. కాల్వలను చెరువులకు అనుసంధానిస్తూ మండలాలవారీగా ఇరిగేషన్‌ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువలతో గొలుసుకట్టు చెరువుల అనుసంధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి. హరీశ్‌రావు, ఎంపీలు కె.కేశవరావు, బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, దివాకర్‌రావు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ మురళీధర్, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు. గొలుసుకట్టు చెరువులపై నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, ఇస్రో రూపొందించిన మ్యాపింగ్‌పై ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్‌ మల్సూర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 

చెరువులు మన వారసత్వ సంపద... 
‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు ఉన్నాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ 1974లోనే తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీటిని కేటాయించింది. అంటే అంత భారీగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంగల గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. సమైక్యపాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనం మిషన్‌ కాకతీయ కార్యక్రమం ప్రారంభించి చెరువులను పునరుద్ధరించుకుంటున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టులతో పొందే నీటిలో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసుకట్టు చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులు ఉన్నాయి.

గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించి ప్రాజెక్టు కాలువకు అనుసంధానించాలి. దాన్ని నింపుకుంటూ వెళ్తే కింద ఉన్న చెరువులూ నిండుతాయి. దీనికోసం కట్టు కాలువ (ఫీడర్‌ చానల్‌), పంట కాలువ (క్రాప్‌ కెనాల్‌)లను సిద్ధం చేయాలి. ప్రతి మండల అసిస్టెంట్‌ ఇంజనీర్‌ దగ్గర ఆ మండలంలోని చెరువుల మ్యాపులు ఉండాలి. ఏ కాలువతో ఏ చెరువును నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్‌ డ్యాములతోపాటు పడబాటు, వానలతో వచ్చే ప్రతి నీటి బొట్టునూ చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్‌ డ్యాములు, చెరువుల నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలూ బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’అని ముఖ్యమంత్రి వివరించారు. 

రెండు నెలల్లో వ్యూహం... 
రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా అన్ని చెరువులూ నింపేందుకు అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ‘వచ్చే ఏడాది జూన్‌ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే చెరువుల అనుసంధానం పూర్తి కావాలి. దీన్ని అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదలశాఖ గుర్తించాలి. చెరువులు, కట్టు కాలువలు, పంట కాల్వలను పునరుద్ధరించాలి. అవి ఎప్పటికీ బాగుండేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఆయకట్టుదారులే కాల్వలు, తూములను మరమ్మతు చేసుకునే వారు. ఎండాకాలంలో చెరువుల్లోని మట్టిని పూడిక తీసేవారు. మళ్లీ ఆ రోజులు రావాలి. గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన, చైతన్యం కలిగించాలి. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తాం.

నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించాలి. అక్కడ అవసరమైన ఎత్తిపోతలు, కాలువలు, రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉండే కుఫ్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీంతో కుంటాల జలపాతానికీ నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణా నదిలోనూ కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటినీ సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహం అమలు చేయాలి’అని సీఎం చెప్పారు.  

‘రైతు బంధు’కు దేశవ్యాప్తంగా ప్రశంసలు 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘తెలంగాణలో 65 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా ఇంతవరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతా రంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికాలలో రైతులతోపాటు పంట ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మన దగ్గర సమైక్య పాలనలో రైతులు వంచనకు గురయ్యారు. తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది. రైతు బంధు పథకాన్ని ఆర్థికవేత్తలు అభినందిస్తున్నారు. ఈ పథకాన్ని ఒక మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ అభివర్ణించారు’అని కేసీఆర్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు