నేడు దుర్గమ్మకు ముక్కుపుడక

28 Jun, 2018 02:40 IST|Sakshi
విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక

మొక్కు చెల్లించుకోనున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ సిద్ధిస్తే దుర్గమ్మకు ముక్కు పుడక చేయిస్తానని గతంలోనే కేసీఆర్‌ మొక్కుకున్నారు. గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు, మనవడితో కలసి విజయవాడకు వెళ్లనున్నారు. 12 గంటలకు విజయవాడ చేరుకోనున్న ఆయన.. 12.45 సమయంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. అనం తరం తిరుగు ప్రయాణమవుతారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారమే కుటుంబ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.  

చంద్రాకారం.. పాలపిట్ట ఆకారంలో.. 
11.29 గ్రాముల బంగారంతో రూపొందించిన చంద్రాకారం, దానిపై 3 వరసలుగా పొదిగిన 57 వజ్రాలు, చంద్రాకారం మధ్యలో చెట్టు కొమ్మ, కొమ్మపై కూర్చున్న రాష్ట్ర పక్షి పాలపిట్ట ఆకారంతో ముక్కుపుడకను రూపొందించారు. పాల పిట్ట ఈకలుగా నీలం రంగు రాళ్లు, చెట్టు కొమ్మలోని పచ్చని ఆకులుగా పచ్చ రాళ్లు పొదిగారు.  

మరిన్ని వార్తలు