టూర్‌ ఉన్నట్టా? లేనట్టా..?

7 Jan, 2019 02:44 IST|Sakshi

సీఎం దుబాయ్‌ టూర్‌పై కొనసాగుతున్న అస్పష్టత

అసెంబ్లీ సమావేశాలు,మంత్రివర్గ విస్తరణలే కారణం

ఒక్కరోజయినా వెళ్లివస్తారనే ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుబాయ్‌ పర్యటన విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఈనెల 6 నుంచి 13వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన దుబాయ్‌ పర్యటన లేనట్టేనని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేయాల్సి ఉండటంతో సమయాభావం ఏర్పడుతుందని, దీంతో ఆయన దుబాయ్‌కి వెళ్లకపోవచ్చని అంటున్నారు. దీనిపై సీఎం కార్యాలయ వర్గాలు మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మరోవైపు అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు కావడంతో కనీసం ఒక్కరోజయినా వెళ్లి ఆ సదస్సులో పాల్గొనే ఆలోచన కూడా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. 

అన్ని అనుమతులు, ఉత్తర్వులు వచ్చాయి
వాస్తవానికి, ఈనెలలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని కేసీఆర్‌కు గత ఏడాదిలోనే ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌ తన పర్యటనకు అవసరమైన దౌత్యపరమైన అనుమతులు కూడా తీసుకున్నారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామికవేత్తలతో భేటీతో పాటు దుబాయ్‌లోని తెలంగాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవా లన్న దానిపై తగిన కసరత్తు చేయాల్సి ఉన్నందున కేసీఆర్‌ దుబాయ్‌ వెళ్లకపోవచ్చని ప్రగతిభవన్‌ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఆఖరి నిమిషంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే గనుక షెడ్యూల్‌ ప్రకారం కాకుండా కనీసం ఒక్కరోజు వెళ్లిరావచ్చని తెలుస్తోంది. మొత్తంమీద కేసీఆర్‌ దుబాయ్‌ పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు