ప్రాంతీయ పార్టీలే కీలకం

2 Jul, 2018 02:55 IST|Sakshi
ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ మాటామంతి

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాజీ ప్రధాని, జేడీయూ అధినేత హెచ్‌డీ దేవెగౌడ జాతీయ రాజకీయాలపై సమాలోచనలు జరిపారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత టి.సుబ్బిరామిరెడ్డి మనుమడి వివాహానికి దేవెగౌడ హాజరయ్యారు. అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సమాఖ్య కూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సమాఖ్య కూటమి ఏర్పాటుకు సంబంధించిన భవిష్యత్‌ కార్యాచరణ విషయంలో ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ పార్టీకి దేశ వ్యాప్తంగా ఎక్కడా ఎదుగుదల కనిపించడం లేదని, బీజేపీకి సైతం సానుకూల పరిస్థితులేమీ లేవని ఇరువురు చర్చించుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సమాఖ్య కూటమి ఏర్పాటు చర్యల్లో భాగంగా మరికొన్ని ప్రాంతీయ పార్టీలను కలవాలని ఇరువురు నిర్ణయించారు. తెలంగాణలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు బాగున్నాయని దేవెగౌడ ప్రశంసించినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో మంత్రి కె.తారకరామారావు, మేయర్‌ బొంతు రామ్మోహన్, మిషన్‌ భగీరథ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. దేవెగౌడను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరంబేగంపేట విమానాశ్రయం నుంచి దేవెగౌడ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.  
 
 
 
  

మరిన్ని వార్తలు