‘శాంతికి విఘాతం కలగవద్దనే బహిష్కరణలు’ 

16 Jul, 2018 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతికి విఘాతం కలగవద్దనే కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్‌ను కలిసి,  ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై ఆయన చర్చించారు. రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు బీమా పథకం ఉద్దేశాలు, వివరాలను గవర్నర్‌కు సీఎం తెలియజేశారు.

వర్షాల రాకతో ఎగువ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వరద ప్రవాహం ప్రారంభమైందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టెంబర్‌ నుంచి సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి వ్యతిరేకంగా శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద  ఆందోళనకు దిగడం ద్వారా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంలో కొన్ని వార్తా చానల్స్‌ వ్యవహరించిన తీరు పట్ల కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని రోజుల కింద గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో సీఎం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు.

 

మరిన్ని వార్తలు