మద్దతు ధర కల్పించేందుకు వ్యూహం ఖరారు చేయండి: సీఎం

16 Apr, 2019 21:27 IST|Sakshi
తెలంగాణ సీఎం కేసీఆర్‌(పాత చిత్రం)

హైదరాబాద్‌: తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని, దానికి తగినట్లు రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 

రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని సీఎం నిర్దేశించారు. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని, నిధుల సేకరణ కోసం మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట మార్కెట్ వచ్చి, కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి అవలంభించాల్సిన వ్యూహం రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

‘‘తెలంగాణ రాష్ట్రం చేసిన ఆలోచన ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించింది. రైతులకు కనీస మద్దతు ధర లభించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా రైతులకు మంచి ధర లభించడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం రూపొందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

‘పండించిన పంటకు మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వమే పూనుకుని చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పండించిన పంటనంతా ఒకేసారి మార్కెట్ కు తీసుకురాకుండా, గ్రామాల వారీగా మార్కెట్ కు తీసుకువచ్చే పద్ధతిని అలవాటు చేయాలి. రైతు సమన్వయ సమితులను ఉపయోగించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

‘‘గతంలో గ్రామాల్లో పండించే కూరగాయలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్మేవారు. కానీ నేడు వేరే ప్రాంతాల నుంచి పట్టణాలకు దిగుమతి చేసుకుని,  పట్టణాల నుంచి కూరగాయలను గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మనం తినే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను మనమే పండించుకోవాలి. ఒక్క బస్తా బియ్యం బస్తా కూడా తెలంగాణకు దిగుమతి కావద్దు. మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవాలి. అంకాపూర్ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా పంటలకు మంచి ధర రాబట్టుకోవాలి. వ్యవసాయ శాఖకు ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలు అనుబంధంగా ఉండాలని, దీనికోసం అధికార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. 
 

మరిన్ని వార్తలు