ప్రత్యామ్నాయంగా నిలిచే వ్యూహం!

2 Jun, 2018 02:07 IST|Sakshi

గుణాత్మక మార్పు లక్ష్యంగా జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి

టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల అధికార పయనంలో కీలక పరిణామాలు 

అసెంబ్లీ సభ్యత్వం రద్దు, సస్పెన్షన్లతో దూకుడు నిర్ణయాలు 

ఆత్మరక్షణలోకి ప్రతిపక్షాలు 

జన సమితి పేరిట కొత్త పార్టీ పెట్టిన కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా నిలువరించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సమయంలో.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను కట్టడి చేసేలా పావులు కదిపారు. అటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా విపక్షం పట్ల కటువుగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీ కార్యాచరణపైనా, కోదండరాంను కట్టడి చేయడంపైనా అదే నిర్బంధ వైఖరిని అమలు చేశారు. టీడీపీని పూర్తిగా ఖాళీ చేసే చర్యలూ కొనసాగించారు. మరోవైపు గతేడాది కాలంలో రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో ‘తెలంగాణ జన సమితి’పేరిట కొత్త పార్టీ ప్రారంభమైంది. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 

కేంద్రంతో పెరిగిన వైరం.. 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు సీఎం కేసీఆర్‌ రాజకీయపరంగా, ప్రభుత్వపరంగా కేంద్ర ప్రభుత్వంతో సానుకూల దృక్పథంతోనే వ్యవహరించారు. అయితే గతేడాదిగా మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా వైరం మొదలైంది. అమిత్‌షా టార్గెట్‌గా కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం పలు పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో దూరం పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, నియోజకవర్గాల పునర్విభజన, జోన్ల విభజన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ మద్దతుకోసం కేసీఆర్‌ ప్రయత్నించారు. ఇందుకోసం పలుమార్లు ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రధాని అపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఇదే సమయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం గౌరవించడం లేదని, ఫెడరల్‌ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని పేర్కొంటూ కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమికోసం పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆయన.. పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశమై చర్చించారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్, కర్ణాటకలో జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, కుమారస్వామి, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ సారథి మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే సారథి కరుణానిధి, స్టాలిన్, కనిమొళి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత హేమంత్‌ సోరెన్‌ తదితరులతో భేటీ అయ్యారు. త్వరలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో కేసీఆర్‌ సమావేశం కానున్నారు.

అన్నివర్గాలనూ ఆకర్షించేలా.. 
రైతులను, యాదవ, ముదిరాజ్‌ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి కేసీఆర్‌ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం ‘రైతు బంధు’పథకం, రైతు బీమా వంటి భారీ పథకాలతో రైతులను టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, ముదిరాజ్, బెస్తవారికోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ వంటి పథకాలను అమలుచేశారు. వీటితోపాటు రాజకీయంగా గుర్తిస్తున్నామనే సంకేతాన్ని ఇవ్వడానికి యాదవ, ముదిరాజ్‌ సామాజిక వర్గాలకు చెందినవారికి రాజ్యసభ అవకాశం కల్పించడం గమనార్హం.

ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు 
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికారంలో ఉన్న పార్టీపై దూకుడుగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు తామే ఆత్మరక్షణలో పడిపోయేలా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. పూర్తి మెజారిటీ లేకున్నా కేసీఆర్‌ పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్‌ మూడు స్థానాలనూ కైవసం చేసుకోవడం గమనార్హం. ఇదే సమయంలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడం వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు విపక్ష కాంగ్రెస్‌ సభ్యులందరినీ బడ్జెట్‌ సమావేశాలు మొత్తంగా సస్పెండ్‌ చేయడం వంటి నిర్ణయాలను తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ, రైతు, నిర్వాసితుల సమస్యలపై పోరాటాలు చేసిన తెలంగాణ జేఏసీపైనా నిర్బంధాన్ని ప్రయోగించారు.

మరిన్ని వార్తలు