ఆరోగ్య ప్రొఫైల్‌.. గజ్వేల్‌ నుంచే

12 Dec, 2019 02:11 IST|Sakshi
గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో సీఎం కేసీఆర్‌కు ఆప్యాయంగా శాలువా అందజేస్తున్న అడివమ్మ

మనం ఎన్ని కోట్లు సంపాదించి పిల్లలకు ఇచ్చామనేది ముఖ్యం కాదు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అందించామన్నదే కీలకం. కోట్లు సంపాదించి పెట్టి వాతావరణ కాలుష్యం ఇస్తే ఏం ప్రయోజనం? ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. పిల్లలను పెంచినట్లు మొక్కలు పెంచాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉండాలి.. అందుకు ప్రజల ఆరోగ్య రికార్డును తయారు చేయాలి.. దీనికి గజ్వేల్‌ నియోజకవర్గమే నాంది కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగులో ఫారెస్టు కళాశాల, పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనాలను ఆయన ప్రారంభించారు.

బుధవారం గజ్వేల్‌ పట్టణంలో సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురిపిస్తున్న  మహిళలు

అనంతరం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం, మహతి ఆడిటోరియాలను ప్రారంభించి.. వంద పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందరి ఆరోగ్య రికార్డు ఉంటుంది. ఇలాగే మన రాష్ట్రం లోనూ తయారు చేయాలని కేసీఆర్‌ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లెడ్‌ గ్రూప్, ఇతర వివరాలు తెలిస్తే వెంటనే చికిత్స అందుతుందన్నారు.

ములుగు అటవీ కళాశాలలో సరస్వతి దేవి విగ్రహం వద్ద పూజ చేస్తున్న సీఎం కేసీఆర్‌.
చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు

ముందుగా గజ్వేల్‌ నియోజకవర్గం ఎక్స్‌రే పేరుతో ప్రతి ఒక్కరినీ పరీక్షించి రికార్డు సిద్ధం చేయాలని చెప్పారు. తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశించారు. గజ్వేల్‌లో నిర్మించిన ఆడిటోరియం పేరు ‘మహతి’అని.. ఈ పేరు తానే పెట్టానని  చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప సంగీత విద్వాంసులు నారద, తుంబురులని, నారద మహాముని వద్ద ఉన్న వీణ పేరు ‘మహతి’ అని చెప్పారు. ఇలాంటి ఆడిటోరియం ప్రతీ నియోజకవర్గంలో నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పా రు. అలాగే ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. అక్కడే సంపద సృష్టించాలని అందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కథానాయకులు కావాలని సీఎం పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు.. 
జనవరి చివరి నాటికి గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాలో ప్రవహిస్తాయని కేసీఆర్‌ చెప్పారు.  కాళేశ్వరం జలాలతో కొండపోచమ్మ సాగర్‌ ప్రాం తమంతా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని కేసీఆర్‌ అన్నారు.

ఈ ప్రాంతంలో ఔషధ, సుగంధ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ‘వికారాబాద్‌ హవా.. లాకో మరీదోంకా ధవా..’(వికారాబాద్‌ ప్రాంతంలోని ఔషధ మొక్కల గాలి లక్షల రోగాల ఉపయోగపడే ఔషధం) అనే నానుడి ఉండేదని కేసీఆర్‌ అన్నారు. అటువంటి వాతావరణం కొండపాక ప్రాంతంలో తీసుకురావాలన్నారు.
 
జర గజ్వేల్‌పై దృష్టి పెట్టండి.. 
తాను వివిధ పనుల నిమిత్తం బిజీగా ఉండి నియోజకవర్గంపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నానని, మంత్రులూ.. మీరే గజ్వేల్‌పై జర కన్నేసి నిధులు మంజూరు చేయాలని కేసీఆర్‌ చమత్కరించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగులో నిర్మించిన అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తన కార్యాలయంలో పనిచేసే ఐఎఫ్‌ఎస్‌ అధికారిని ప్రియాంకా వర్గీస్‌ స్ఫూర్తి అని కేసీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఈటల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్‌ కార్పొషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్త, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్‌రావు, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, సతీష్‌కుమార్, పీసీసీఆర్‌ ఆర్‌ శోభ, డీన్‌ చంద్రశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు.  

ఏమ్మా.. కిలో టమాటా ఎంత? 
రాయపోలు(దుబ్బాక): గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. గజ్వేల్‌కు చెందిన కూరగాయల వ్యాపారి అడివమ్మను పలకరించారు. ఏమ్మా వ్యాపారం ఎలా ఉంది.. టమాటా కిలో ఎంత అంటూ ప్రశ్నించారు. బాగుంది సారూ.. అని ఆమె చెప్పగానే ‘మరి నాకు కూరగాయలు ఏమైనా ఇస్తావా’.. అంటూ అడిగారు. దీనికి ఆమె సంతోషంగా నవ్వులు కురిపిస్తూ.. ‘అయ్యో ఎంతమాట సారూ.. ఏం కావాలంటే అది ఇస్తాను..’అంటూ నాలుగైదు రకాల కూరగాయలను కేసీఆర్‌కు ఇవ్వబోయింది. అందుకు బోణీ అయిందా అంటూ.. ఆయన తన జేబులోంచి రూ.2 వేల నోటును తీసి అడివమ్మకు ఇచ్చారు. దీంతో ఎంతో సంబరపడిన అడివమ్మ.. కేసీఆర్‌కు రెండు చేతులు జోడించి దండం పెట్టింది. అనంతరం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. మాంసం వ్యాపారులు, చేపల వ్యాపారులతో మాట్లాడారు. మల్లన్నసాగర్‌ పూర్తయితే అన్ని చెరువులు నీటితో నిండుతాయని, అప్పుడు మన చేపలే అమ్ముకుందామని వ్యాపారులతో అన్నారు.  

మోడల్‌ సీఎం కేసీఆర్‌ హరీశ్‌రావు 
నియోజకవ ర్గం ఎలా ఉండాలో చేసి చూపించిన  కేసీఆర్‌ అని, గజ్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శమని మంత్రి  హరీశ్‌రావు అన్నారు. బుధవారం మహతి ఆడిటోరియం లో ఆయన మాట్లాడారు.

ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రం, ఉద్యానవన వర్సిటీ, సమీకృత మార్కెట్, మహతి ఆడి టోరియం అన్నీ ఒకే రోజు ప్రారంభమయ్యాయని.. ఇది గజ్వేల్‌ చరిత్రలో శుభదినం అన్నా రు. ఒక్క గజ్వేల్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికి తాగునీరు అందిం చిన ఘనత తెలంగాణదని, ఆ క్రెడిట్‌ అంతా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు