ప్రధాన ఆదాయ వనరుకు వ్యాపారుల చిల్లు..!

8 Feb, 2018 16:01 IST|Sakshi

వాణిజ్య పన్నుల శాఖలో పేరుకు పోయిన బకాయిలు

జీఎస్టీకి ముందు 2,19,561 మంది డీలర్లు

వస్తు, సేవల పన్ను రాకతో పాతవి ఎగవేత

ఎట్టకేలకు రంగంలోకి దిగుతున్న అధికారులు

డివిజన్, సర్కిళ్ల స్థాయిలో బృందాల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌ : వాణిజ్య పన్నుల శాఖలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. జీఎస్టీ అమలుకు ముందు ఉన్న బకాయిలు చెల్లించేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వసూలయ్యే పన్నులు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి మొత్తం 12 డివిజన్లు, 232 సర్కిళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రూ.39,261.40 కోట్ల పన్నులు విధించగా రూ.37,856.83 కోట్ల మేర వ్యాపారులు చెల్లించారు. ఇంకా రూ.1,404.56 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

జీఎస్టీకి ముందు రాష్ట్రవ్యాప్తంగా 2,19,561 మంది డీలర్లు ఉన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవ పన్ను(జీఎస్టీ)ని 2017, జూలై ఒకటి నుంచి అమలు చేస్తోంది. గతంలో వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను), టీఓటీ (టర్నోవర్‌ ట్యాక్స్‌), సెంట్రల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌లను ప్రభుత్వం వసులు చేసేవి. ఈ పన్నులన్నీ రద్దు చేసి కొత్తగా వస్తు సేవ పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని ఐదు శ్లాబ్‌లుగా విభజించారు. ఇందులో 5, 8, 12, 28, 40 శాతం పన్నులు ఉంటాయి. జీఎస్టీ విధానంతో వ్యాపారాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రతీ డీలర్‌ ఆన్‌లైన్‌లో అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు.
ప్రతినెలా 25న ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపరిచి పన్నులు చెల్లిస్తున్నారు. నో రైడ్స్‌.. జీఎస్టీ అమలుకు ముందు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. దీంతో పాత బకాయిలు వసూలు కావడంలేదు. గతంలో పన్నులు చెల్లించకుంటే వ్యాపారస్తులకు సంబంధించిన సీ ఫాంలు నిలిపివేసేవారు. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండడంతో సీ ఫాంలు అవసరం లేకుండాపోయాయి. వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖకు ఎలాంటి పెత్తనం లేకపోవడంతో బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ప్రత్యేక బృందాలు.. పాత బకాయిలను వసూలు చేసేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. డివిజన్, సర్కిల్‌ స్థాయిల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మొండి బకాయిలను వసూలు చేయనున్నారు.
-వరంగల్‌ రూరల్‌ నుంచి గజవెళ్లి షణ్ముఖరాజు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు