కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

6 Mar, 2018 08:57 IST|Sakshi

జిల్లాలో ముగిసిన కాంగ్రెస్‌ బస్సుయాత్ర

కేసీఆర్‌ లక్ష్యంగా పదునైన విమర్శలు

స్థానిక అంశాలపై ప్రత్యేక ప్రస్తావన

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌:  టీపీసీసీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు సాగిన ఈ యాత్ర నాలుగు చోట్ల బహిరంగసభలను నిర్వహించింది. తొలిరొజు బోధన్, నిజామాబాద్‌ నగరాల్లో నిర్వహించగా., సోమవారం నందిపేట్, భీంగల్‌లలో బహిరంగసభలు జరిగాయి. సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీప ప్రాంతాల నుంచి జనసమీకరణ చేసింది. నిజామాబాద్‌ అర్బన్, రూరల్‌ నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు నాయకులు తమ ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించేందుకు పోటీపడ్డారు. అంతర్గతంగా కుమ్ములాటలున్నప్పటికీ.. ఈ యాత్ర కోసం ఐక్యతారాగాన్ని ఆలపించారు. బస్సుయాత్ర సజావుగా సాగడంతో జిల్లా ముఖ్య నాయకత్వం ఊపిరి పీల్చుకుంది.

రైతాంగ సమస్యలపై..  
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర చేపట్టామని ప్రకటించిన రాష్ట్ర అధినాయకత్వం ఒకవైపు సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూనే.. జిల్లా అంశాలను కూడా ప్రస్తావించారు. రెండో రోజు బస్సుయాత్ర సాగిన ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావడంతో రైతాంగ సమస్యలపై దృష్టి సారించారు. పంట రుణ పరిమితి పెంపు, మద్దతు ధరలు వంటి అంశాలను నేతలు ప్రత్యేకించి ప్రస్తావించారు.

 కొన్ని నెలల క్రితం ఆర్మూర్‌ డిక్లరేషన్‌ పేరుతో ఆలూరులో రైతుసదస్సు నిర్వహించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఈ బస్సుయాత్రలో కూడా రైతాంగ సమస్యలపై దృష్టి సారించింది. ప్రత్యేకంగా పార్టీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర నాయకత్వం రైతుల అంశాన్ని ప్రస్తావించింది. ఆర్మూర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభానికే నోచుకోని అంశాన్ని లేవనెత్తారు. తొలిరోజు ఆదివారం బోధన్‌ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలనే ఎన్నికల హామీతో పాటు, మైనార్టీల సంక్షేమ అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేసిన విషయం విదితమే.  

అంటీముట్టనట్టుగా మధుయాష్కి..
మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ ఈ బస్సుయాత్రలో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. ఈ యాత్ర దాదాపు నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోనే సాగడంతో నాలుగు బహిరంగసభల్లో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయని భావించారు. ఒక్క నిజామాబాద్‌ అర్బన్‌లో సభకు మాత్రమే హాజరైన మధుయాష్కి, కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. మిగితా మూడు సభల్లో ఆయన కనిపించలేదు. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన ఏర్పాట్ల నిమిత్తం ఆయన మలేషియా వెళ్లడంతో ఈ సభలకు హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు