సంక్షోభంలో విద్యా రంగం

9 Oct, 2016 02:38 IST|Sakshi
సంక్షోభంలో విద్యా రంగం

కాంట్రాక్టర్లకు తప్ప ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవా?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వైఖరివల్ల విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవితో కలసి శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందనుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సంక్షోభంలోకి పోయిందన్నారు.

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.2,140 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. దీనివల్ల నాలుగు నెలల నుంచి ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అందకపోవడం వల్ల వారి సర్టిఫికెట్లను ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తున్నాయని, దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ వంటి పనులకు నెలకు రూ.2వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని, జిల్లాల ఏర్పాటు విషయంలో అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందన్నారు.

రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో శాస్త్రీయత, ప్రజల అవసరాలు, అభిప్రాయాలను  సీఎం పట్టించుకోవడంలేదన్నారు. ప్రజలకు నష్టం జరిగే అంశాలపై అధ్యయనం చేయకుండా హడావిడిగా జిల్లాల విభజన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కొంత ఆలస్యమైనా అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయాలను తీసుకుని జిల్లాల విభజన పూర్తిచేయాలని ఉత్తమ్ సూచించారు.
 
అఖిలపక్షాన్ని పిలవాలి: షబ్బీర్
జిల్లాల విభజన విషయంలో మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని పిలవకుండా, ప్రతిపక్షాలను కేసీఆర్ అవమానిస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రతిపక్షాలకు ముసాయిదాను మూడురోజులు ముందుగా పంపించి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోవడంలేదన్నారు. మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి నిర్ణయం తీసుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన సీఎం మోసం చేశాడని అన్నారు.

మరిన్ని వార్తలు