'వాటర్ గ్రిడ్ కాదు.. స్కాం గ్రిడ్, కరప్షన్ గ్రిడ్'

4 Apr, 2015 14:18 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వాటర్ గ్రిడ్ పథకం అవినీతి మయమైందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ మండిపడ్డారు. శనివారం ఇక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ.. అది వాటర్ గ్రిడ్ కాదు.. స్కాం గ్రిడ్, కరప్షన్ గ్రిడ్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడికి రూ.40వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చే విధంగా టెండర్లలో అవకతవకలు జరిగాయని వారు విమర్శించారు. ముడుపుల కోసం తమకు కావాల్సిన  కంపెనీలు క్వాలీఫై అయ్యేవిధంగా  స్వల్ప తేడాతోనే టెండర్లు వేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్టుల్లో ఒక్క తెలంగాణ కాంట్రాక్టరుకు కూడా చోటు దక్కలేదని.. వెంటనే వీటిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

నిబంధనలు సవరించి మరోసారి  టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అధికారం ఉందనే అహంకారంతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. మంత్రి కేటీర్ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వాటర్ గ్రిడ్లో అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు చేపడుతామని ఉత్తమ్, జానారెడ్డి, భట్టి, షబ్బీర్ అన్నారు. 

మరిన్ని వార్తలు