నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అధికారులను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

30 Aug, 2019 20:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ.. పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు, ఏఐసీసీ సెక్రటరీ వంశీచందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌, వంశీ కృష్ణలు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారటీ అదనపు డైరక్టర్‌ డా.అనూప్‌ కుమార్‌ నాయక్‌ను కలిసి మెమోరాండం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చాయన్నారు. దాదాపు 25 వేల ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల జీవన విధానంలో మార్పులు వస్తాయనుకున్నాం.. కానీ ఇలాంటి అన్యాయాలు చూడాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది లాభం కోసం యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చి బహుళ జాతి కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరామన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు.

తవ్వకాలతో వన్యప్రాణులకు నష్టం: వంశీ కృష్ణ
దేశంలోనే అతిపెద్ద ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఆరోపించారు. యురేనియం తవ్వకాలతో అడవులకు, వన్య ప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ నది నీరు తాగే ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వెంటనే యురేనియం తవ్వకాలు ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు వంశీ కృష్ణ.

గిరిజనుల బాధలు వినిపించాలని వచ్చాం: సంపత్‌
నల్లమల ఆమ్రాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు గిరిజనుల తరఫున.. వారి బాధలు వినిపించాలని ఢిల్లీ వచ్చామన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్‌. నల్లమలలో అటవీ సంపదను నాశనం చేసే కుట్ర జరుగుతుందన్నారు. నల్లమల అడవుల్లో ఎవరైనా అడుగుపెడితే బాగోదని, తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని సంపత్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు