ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

2 Jun, 2019 05:17 IST|Sakshi

పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. యూపీయే చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియాగాంధీని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నారు. సోనియా పేరును మన్మోహన్‌సింగ్‌ ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.  

మెరుగైన పనితీరు కనబరుస్తా: ఉత్తమ్‌
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తాను ఈసారి లోక్‌సభకు ఎన్నికవ్వడం సంతృప్తికరంగా ఉందని, పార్లమెంటు సమావేశాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తానని ఉత్తమ్‌ పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక్కరిదే బాధ్యత కాదని, అది అందరి సమష్టి బాధ్యత అన్నారు. పార్టీ బలోపేతానికి రాహుల్‌ ఎంతో కృషి చేశారని, పార్టీకి ఆయన సేవలు అవసరమని, దేశానికి కాంగ్రెస్‌ అవసరం కాబట్టి రాహుల్‌ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని తనతోపాటు కార్యకర్తలందరూ కోరుతున్నారన్నారు.

తెలంగాణలో బీజేపీకి అదృష్టవశాత్తు నాలుగు సీట్లు వచ్చాయి తప్ప రానున్న రోజుల్లో ఆ పార్టీ బలపడే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌కు గ్రామ పంచాయతీల వారీగా ఉన్న బలమైన కేడర్‌ బీజేపీకి లేదన్నారు. ఇక రాహుల్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ, ఓయూ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, ఉత్తమ్, కోమటిరెడ్డి శిబిరాన్ని సందర్శించి దీక్షలు విరమించాలని కోరా రు. వారి విజ్ఞప్తులను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని టీపీసీసీ నేతలు మానవతారాయ్, నాయిని యాదగిరి, సాజిద్‌ బేగ్‌లు తెలిపారు.

మరిన్ని వార్తలు