అడ్డుకోకుంటే దక్షిణ తెలంగాణ ఎడారే

15 May, 2020 03:49 IST|Sakshi
కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు

ఏపీ ప్రాజెక్టులపై తక్షణమే జోక్యం చేసుకోండి

కృష్ణా బోర్డు చైర్మన్‌కు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టదలిచి న రాయలసీమ లిఫ్టు పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్ధ్యం పెంపు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీపీసీసీ ప్రతినిధుల బృందం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ చేపట్టబోయే ప్రాజెక్టులను నిలువరించకుంటే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్లగొండలు పూర్తిగా ఎడారయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీ ప్రాజెక్టుల విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని వాటిని ఆపాలని, దీన్ని వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. గురువారం ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నేతలు నాగం జనార్ధన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలతో కూడిన బృందం జలసౌధలోని బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో భేటీ అయింది. ఏపీ ఇచ్చి న జీవో 203 అంశాన్ని వివరించడంతో పాటు, తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించింది. పునర్‌వ్యవస్థీకరణ చట్టం మేరకు దీన్ని అడ్డుకోవాలని సూచించింది.

ప్రధానికి, కేంద్రమంత్రికి లేఖలు రాస్తాం: ఉత్తమ్‌
ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీ ఇచ్చిన జీవోతో తెలంగాణకు తీవ్ర నష్టమని, వీటిని వెంటనే ఆపేలా తమ పరిధిలో చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో పాటు, క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కోరామన్నారు. ఏపీ జీవో మేరకు ముందుకు పోతే, దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారడంతో పాటు, సాగర్‌ జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కష్టాలు తప్పవన్నారు. దీంతో పాటే నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు టెలిమెట్రీ వ్యవస్థను సమర్ధంగా వాడేలా చూడాలని, రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో పర్యవేక్షణ ఏర్పా టు చేయాలని కోరామన్నారు.

దీనిపై తప్పనిసరిగా పరిశీలన చేసి తమ పరిధి మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై పార్టీ ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీకి లేఖ రాస్తామని, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాశామని,  ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు చేశామని తెలిపారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు కట్టారని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘అన్నోడికి సిగ్గు, శరం ఉండాలి. నేను ఆ రోజు మంత్రిగా లేనని గుర్తుంచుకోవాలి’అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చెబుతున్నట్లుగా ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదని, కాళేశ్వరం పాత ప్రాణహిత–చేవెళ్ల అయితే, దుమ్ముగూడెంను సీతారామ సాగర్‌గా పేరుమార్చారన్నారు.

మరిన్ని వార్తలు