టీఆర్‌ఎస్‌తో టీపీసీసీ నేతల కుమ్మక్కు

21 Mar, 2019 02:31 IST|Sakshi

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ  ఉనికికే ప్రమాదం తెస్తున్నారు

బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీలో డీకే అరుణ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కుమ్మక్కయ్యా రని మాజీ మంత్రి డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌తో ఉన్న లాలూచీలో భాగంగానే వారు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికే ప్రమాదం తీసుకొస్తున్నారని ఆమె అన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో డీకే అరుణ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె బీజేపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావులతో కలసి మీడియాతో మాట్లాడా రు. టీకాంగ్రెస్‌ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎండగట్టలేకపోతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌తో లాలూచీలో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్‌ను పూర్తిగా క్షీణించేలా చేస్తున్నారని ఆరోపించారు.  

ఆ విధానాలు ఎండగట్టేందుకే.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు దేశానికి ఒక బలమైన నాయకత్వాన్ని అందిస్తున్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరినట్టు అరుణ వివరించారు. టీఆర్‌ఎస్‌తో పీసీసీ ముఖ్య నేతల లాలూచీ వల్ల తెలంగాణలో నశించిపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు.. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రజల్ని రక్షించుకుంటామని చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు తెలంగాణ నుంచి తామందరం కృషి చేసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఇక తాను కాంగ్రెస్‌ను వీడేందుకు దారితీసిన పరిస్థితులపై హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరిస్తానని అరుణ వెల్లడించారు. 

మరిన్ని చేరికలుంటాయి: మురళీధర్‌రావు 
డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని మురళీధరరావు అన్నారు. తెలంగాణలో పూర్తిగా క్షీణిస్తున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుం దని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అరుణ చేరిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరారు. మురళీధర్‌రావు, లక్ష్మణ్‌ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బొంగరం కూడా తిప్పలేరు
‘ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ కొత్త అంశాలను తెరమీదకు తెస్తున్నారు. మోదీని మించిన హిందువును నేనంటూ మాట్లాడుతున్నారు. ఆయన హిందువు అవునో.. కాదో.. తెలియదు కానీ, ఒవైసీని మిం చిన ముస్లింగా షేర్వాణి, టోపీ పెట్టుకొని కేసీఆర్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఎన్నో యాగాలు చేశానని చెబుతున్న కేసీఆర్‌ అవన్నీ యువరాజు పట్టాభిషేకం కోసమా.. లేక తన కుమార్తెను ఢిల్లీలో మంత్రిని చేసేందుకు చేశారా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అడ్డం పెట్టుకొని కేటీఆర్‌ హరీశ్‌ మెడలు వంచినట్టు.. కేంద్రం మెడలు వంచలేరని లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌ ఎన్ని అనుకున్నా ఢిల్లీలో చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేరన్నారు.

మరిన్ని వార్తలు