తెలంగాణ యోధుడు రాంరెడ్డి కన్నుమూత

31 Jul, 2019 04:38 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, సీపీఎం సీనియర్‌ నేత గట్టికొప్పుల రాంరెడ్డి(90) కన్నుమూశారు. ఎల్‌బీనగర్‌ కామి నేని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన రాంరెడ్డికి భార్య వరలక్ష్మి, కుమారుడు వినాయకరెడ్డి, కుమార్తెలు వనజాత, శ్రీదేవి, రమాదేవి, సరళ ఉన్నారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు వెంకటనర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యంలతో కలసి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. తన మేనమామ దేవిరెడ్డి లక్ష్మీనర్సింహారెడ్డి స్ఫూరి తో విద్యార్థిదశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి అనే క ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాయుధ పోరాటం లో భాగంగా అజ్ఞాతంలో ఉన్న నేతలకు కొరియర్‌ గా సేవలు అందించారు.

ముల్కపట్నం గ్రామాని కి సర్చంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ గ్రామ పంచాయతీ నుంచి విడివడిన తడకమళ్లకు 35 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. మిర్యాలగూడ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. స్పాండిలోసిస్‌ వ్యాధితో రెండేళ్లుగా బాధపడుతూ మంచానికే పరిమతమయ్యారు. వారం క్రితం గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు కామినేని ఆసుపత్రికి తరలించారు. మాజీ హోంమంత్రి కె.జానారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఐద్వా నేత మల్లు లక్ష్మి తదితరులు ఆసుపత్రిలో రాంరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాంరెడ్డి భౌతికకాయాన్ని మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. బుధవారం ఉదయం తడకమళ్లలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వినాయకరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు