తెలంగాణ డయాగ్నస్టిక్స్‌

2 Jan, 2018 02:43 IST|Sakshi

ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు

ఆరోగ్య శాఖ కొత్త పథకం

ఈ వారంలోనే హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభం

సంక్రాంతిలోపు రాష్ట్రవ్యాప్తంగా సేవలు

ఆన్‌లైన్‌లో నివేదికలు.. పథకం కోసం రూ. 10 కోట్ల నిధుల విడుదల

ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌కు దీటుగా సేవలు

సాక్షి, హైదరాబాద్‌
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. వైద్య సేవలు, చికిత్సలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారం భించనున్నారు. తొలుత ఈ వారంలోనే నగరంలో ప్రయోగాత్మకంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిం చడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రయోగాత్మక కార్యక్రమంలో వచ్చే ఇబ్బందులను సరి చేసి సంక్రాంతిలోపు పూర్తి స్థాయిలో ఈ సేవలను ప్రారంభించనున్నారు.

మొదట పాత జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆ తర్వాత కొత్త జిల్లాల కేంద్రాలకు విస్తరిస్తారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసింది. కార్పొరేట్, ప్రైవేట్‌ డయాగ్నస్టిక్స్‌కు దీటుగా ప్రభుత్వ పరంగా ఈ సేవలను అందించేలా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) ఆవరణలోని ల్యాబ్‌కు అదనంగా మరో అత్యాధునిక డయాగ్నస్టిక్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు ఎక్కడైనా నివేదికలు తీసుకునేలా ఎప్పటికప్పుడు వీటిని ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు.

రోగనిర్ధారణ పరీక్షలే కీలకం..
వైద్య సేవలలో డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోగ నిర్ధారణలో ఎంత స్పష్టత ఉంటే అంత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్‌ పేషెంట్లకే ఉచితంగా ఈ సేవలు అందుతున్నాయి. అయితే ఔట్‌ పేషెంట్లుగా వచ్చే పేద వర్గాలకు ఇది ఇబ్బందిగా ఉంటోంది. బీపీ, మధుమేహం, మూత్ర పరీక్షలకు సైతం ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. రోగ నిర్ధారణకు వైద్యులు సిఫారసు చేసినా డబ్బులు లేక పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో వారు సరైన చికిత్స తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా అధికశాతం ప్రభుత్వ ఆస్పత్రులలో పరికరాలు, సిబ్బంది సరిగాలేక సాధారణ పరీక్షలు సైతం నిర్వహించడంలేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్తగా ప్రారంభిస్తున్న పథకంతో ఈ పరిస్థితులు మారనున్నాయి.

ఔట్‌ పేషెంట్లకూ ఉచితం..
ఇకపై ఔట్‌ పేషెంట్లకు కూడా ఉచిత పరీక్షల సేవలు అందిస్తారు. అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. పరీక్షలకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. కాగా, ఆయా ఆస్పత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించనున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 39 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని స్థాయిల ఆస్పత్రుల్లోనూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రక్తం, మూత్ర, మల పరీక్షలకు సంబంధించిన నమూనాలు సేకరిస్తారు. ఆయా ఆస్పత్రుల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఐపీఎంలోని రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి వాటిని చేరుస్తారు. మరుసటి రోజు ఉదయం నమూనాలను పరీక్షించి, మధ్యాహ్నం రెండు గంటలలోపు పరీక్ష నివేదికలను ఆన్‌లైన్‌లో సంబంధిత ఆస్పత్రికి పంపిస్తారు. ఆస్పత్రి నుంచి రోగికి ఆన్‌లైన్‌లో చేరవేస్తారు. అవసరమైతే రోగికి నేరుగా నివేదికలను ఇస్తారు. కాగా, తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఐపీఎంలో నిర్వహించగా, ఇతర సాధారణ పరీక్షలను స్థానికంగా నిర్వహిస్తారు.

వైద్య సేవల్లో మార్పులు: వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌
తెలంగాణ డయాగ్నస్టిక్స్‌తో రాష్ట్రంలోని వైద్య సేవలలో ఎన్నో మార్పులు వస్తాయి. వైద్య సేవలలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. వారంలోనే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఈ సేవలు మొదలవుతాయి. రెండోవారంలో అధికారికంగా పూర్తి స్థాయిలో సేవలను అందిస్తాం.

>
మరిన్ని వార్తలు