రాష్ట్రం ఆశలు... అడియాసలు

6 Jul, 2019 03:49 IST|Sakshi

తెలంగాణపై దయచూపని తెలుగింటి కోడలి లెక్కల పద్దు

కాళేశ్వరానికి మళ్లీ మొండిచేయే కాకతీయ, భగీరథలకు పైసా లేదు

నీతి ఆయోగ్‌ సిఫారసులనూ పక్కనపెట్టిన మోదీ సర్కారు

అద్భుత పథకాలని ప్రశంసలే తప్ప కాసులు విదల్చని కేంద్రం

పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకూ దక్కని ప్రాధాన్యత

కొత్త సంక్షేమ పథకాల అమలుకు నిధుల కటకట

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చే నిధులనుబట్టి పూర్తిస్థాయి బడ్జెట్‌ పెడదామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. కనీసం నీతి ఆయోగ్‌ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్రానికి చెందిన ఉపయుక్త ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు కేటాయించలేదు. మొత్తం బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ. 19 వేల కోట్లకుపైగా చూపిన కేంద్రం... ఈసారి కూడా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మొత్తంమీద కేంద్ర బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

కాళేశ్వరంపై కరుణ లేదు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని లేదంటే రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. స్వయంగా సీఎం కేసీఆర్‌ కూడా ప్రధానిని కలసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లిన ఆర్థికశాఖ అధికారులు కూడా మరోసారి ఈ ప్రతిపాదనను అధికారికంగా కేంద్రం ముందుంచారు. కానీ 2019–20 బడ్జెట్‌లో కేంద్రం ఒక్క రూపాయిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించలేదు.  

కాపీ కొట్టారు కానీ కాసులివ్వలేదు...
మిషన్‌ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. మన పథకానికి మాత్రం డబ్బులివ్వలేదు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ. 19,500 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. నీతి ఆయోగ్‌ కూడా ఈ పథకం అద్భుతమని ప్రశసించి నిధులివ్వాలని కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. అయినా నీతి ఆయోగ్‌ సిఫారసులను, ప్రశంసలను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్‌ కాకతీయ పథకానికి కూడా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా ఈ పథకం గురించి కూడా కేంద్రం పట్టించుకోలేదు. అయినా దేశవ్యాప్తంగా జలశక్తి పథకానికి రూ. 10 వేల కోట్లు ఎలా సరిపోతాయనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒక్క తెలంగాణలోనే మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లు అవసరం కానుండగా దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఎలా సరిపోతాయని ఉన్నతస్థాయి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వే లైన్లు లాంటి అంశాలను కూడా కేంద్రం పక్కన పడేయడం గమనార్హం.

కొత్త పథకాలకు కటకటే...!
రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఏ ఒక్క పథకానికి కూడా కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, నెలవారీ సాధారణ ఖర్చులకు రాష్ట్ర ఖజానా నుంచి తీసినా కేంద్ర సాయంతో కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఈ లెక్కలు తప్పడంతో ఇప్పుడు కొత్త సంక్షేమ పథకాల అమలుకు కటకట ఎదురుకానుంది. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి లాంటి వాటి అమలుకు ఆర్థిక వెసులుబాటు కష్టమేనని, కొత్త పథకాల అమలులో జాప్యం జరుగుతుందని
అధికార వర్గాలంటున్నాయి.

మరిన్ని వార్తలు