జీతాలతో పనేముంది?

28 Dec, 2019 08:59 IST|Sakshi

డిస్కంలో కొందరు ఇంజినీర్ల మాయాజాలం

ఏడేళ్లుగా వేతనాలు డ్రా చేయకుండా విధులు

ఆమ్యామ్యాలతోనే గడిపేస్తున్నట్లు విమర్శలు

ఎల్‌పీసీ లేకుండానే బదిలీలు, పదోన్నతులు సైతం

కొందరిని గుర్తించి, రిలీవ్‌ చేసిన యాజమాన్యం

సాధారణంగా ఏ ఉద్యోగి అయినా నెల గడిచిందంటే జీతం డబ్బుల కోసం ఎదురుచూస్తారు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలోని కొందరు ఇంజినీర్లు మాత్రం ఇందుకు భిన్నం. వారికి జీతం డబ్బులతో పనిలేదు. అందుకే ఏడేళ్లుగా జీతమే డ్రా చేయడం లేదు. డిస్కం ఆపరేషన్‌ విభాగంలోని దాదాపు వంద మంది ఇంజినీర్లు గత ఏడేళ్లుగా వేతనాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో అందుతుండడంతో వీరు వేతనాల జోలికి వెళ్లడం లేదని, రిటైర్మెంట్‌ సమయంలో ఒకేసారి ఈ వేతనాలు డ్రా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో: కుటుంబం సాఫీగా గడవాలంటే...ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నెల జీతం తప్పని సరి. అయితే ఏళ్ల తరబడి వేతనం డ్రా చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఘనత ఒక్క దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇంజినీర్లకు మాత్రమే దక్కింది. ఒకటి కాదు రెండు కాదు..ఒక్కొక్కరు ఏడెనిమిదేళ్లుగా వేతనాలు తీసుకోకుండా విధుల్లో కొనసాగుతుండటాన్ని పరిశీలిస్తే డిస్కంలో ఇంజినీర్ల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్‌ విభాగంలో పని చేస్తున్న కొందరు ఇంజినీర్లకు నెలసరి వేతనంతో పోలిస్తే కొత్తలైన్లకు సంబంధించిన వర్క్‌ ఎస్టిమేషన్, వివిధ విద్యుత్‌ పనులకు అనుమతులు జారీ చేసినందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ల నుంచి లభించే కమీషన్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కమీషన్లకు జీతం తోడైతే..భారీగా ఆస్తులు జమై...అక్రమాస్తుల సంపాదన కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉండటంతో పలువురు ఇంజినీర్లు జీతం తీసుకోకుండా కేవలం కమీషన్లతోనే కుటుంబ అవసరాలు తీర్చడంతో పాటు భారీగా స్థిరాస్తులను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఉద్యోగ విరమణకు ముందు పెండింగ్‌లో ఉన్న వర్క్‌ ఆర్డర్‌ ఫైళ్లన్నీ క్లోజ్‌ చేస్తే..ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనం సహా అప్పటి వరకు సంస్థ నుంచి రావాల్సిన ఇతర బెనిఫిట్లన్నీ ఒకేసారి దక్కే అవకాశం ఉండటంతో కొందరు  ఇంజినీర్లు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకుని, ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు ఈ కొత్త తరహా ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంస్థలో అక్రమార్జనపై ఆధారపడి, జీతం తీసుకోకుండా పనిచేస్తున్న ఇంజినీర్ల సంఖ్య వందకుపైగా ఉన్నట్లు అంచనా. అయితే వీరిలో ఇటీవల 15 మందిని గుర్తించిన యాజమాన్యం వారిని ఆయా విధుల నుంచి రిలీవ్‌ చేసినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ శాతం గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్లే కావడం గమనార్హం.

ఎల్‌పీసీ లేకుండా బదిలీలు..ఆపై పదోన్నతులు:
కొత్తలైన్ల ఏర్పాటు, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు, లైన్‌షిఫ్టింగ్‌ వర్కులు, భూగర్భకేబుల్‌ వర్కులకు ఆయా సెక్షన్‌ పరిధిలోని ఏఈ, ఏడీఈ, డీఈలు అంచనాలు రూపొందిస్తారు. ఆ తర్వాత ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి, అర్హులైన వారికి పనులు అప్పగిస్తుంటారు. ఆయా పనులు పూర్తయిన తర్వాత ఆ పని చేసిన కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులు, స్టోర్స్‌ నుంచి తీసుకొచ్చిన డీటీఆర్‌లు, కండక్టర్, పోల్స్, కాసారాలు, మీటర్లు సహా ఇతర మెటిరీయల్‌కు సంబంధించిన పూర్తి బిల్లులను ఆడిట్‌ విభాగానికి అందజేయాల్సి ఉంది. ఒక వేళ పని పెండింగ్‌లో ఉన్నట్లైతే..అప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన పూర్తి బిల్లులను ఆడిట్‌ విభాగానికి అందజేయాలి. ఒక డివిజన్‌ నుంచి మరో డివిజన్‌కు, ఒక సెక్షన్‌ నుంచి మరో సెక్షన్‌కు ఉద్యోగి బదిలీపై వెళ్లినప్పుడు విధిగా లాస్ట్‌ పేమెంట్‌ సర్టిఫికెట్‌(ఎల్‌పీసీ) సమర్పించాల్సి ఉంది. ఒక వేళ వర్క్‌ను కంప్లీట్‌ చేయకుండా పెండింగ్‌ పెడితే.. సంబంధిత సెక్షన్‌ ఉన్నతాధికారులు సదరు ఇంజినీర్లకు ఎల్‌పీసీ జారీ చేయకపోవడమేగాక నెల జీతం కూడా నిలిపివేస్తారు. వాస్తవానికి ఎల్‌పీసీ సమర్పించని ఇంజినీర్లకు బదిలీలు, పదోన్నతుల్లో అవకాశం కల్పించరాదు. కానీ డిస్కంలో లాస్ట్‌ పేమెంట్‌ సర్టిఫికెట్‌ సమర్పించకుండా ఏళ్ల తరబడి జీతం కూడా తీసుకోకుండా పని చేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులు కట్టబెడుతుండటం వివాదాస్పదంగా మారుతోంది. సంస్థ పరిధిలోని ప్రతి ఉద్యోగి తాలుకూ సమాచారం సంబంధిత మానవ వనరుల విభాగం(హెచ్‌ఆర్‌)లో ఉంటుంది. ఏ ఉద్యోగి ఎం త కాలం నుంచి జీతం తీసుకోవడం లేదో ఇట్టే తెలిసిపోతుంది. అయితే డిస్కంలోని హెచ్‌ఆర్‌ విభాగం మాత్రం దీనిని చాలా చిన్న అంశంగా చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎల్‌పీసీలు సమర్పిం చని ఇంజినీర్లను నాన్‌పోకల్‌ పోస్టుల్లోకి బదిలీ చేయాలి. అయితే అక్రమార్జన కేసుల్లో ఇప్పటికే అరెస్టైన పలువురు ఇంజినీర్లను ఆపరేషన్‌ విభాగంలోని కీలకమైన ఫోకల్‌ పోస్టుల్లో కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది.

బదిలీ ఆర్డర్స్‌ ఇచ్చినా అక్కడే: విద్యుత్‌ సంస్థల్లో ప్రతి మూడేళ్లకోసారి ఉద్యోగుల బదిలీలు చేపడతారు. నిబంధనల ప్రకారం ఒక సెక్షన్‌లో వరుసగా మూడేళ్ల పాటు పని చేసిన ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్‌ఈ, సీజీఎంలను ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తుంటారు. నిజానికి ఫోకల్‌ పోస్టుల్లో పని చేసిన వారిని, నాన్‌ఫోకల్‌ పోస్టుల్లోకి, ఆపరేషన్‌ విభాగంలో పని చేసిన వారిని ప్రాజెక్ట్‌ విభాగంలోకి బదిలీ చేయాల్సి ఉంది. అయితే డిస్కంలో ఇందుకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అక్రమార్జనకు అలవాటుపడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్లకు పోస్టుల కేటాయింపులో పెద్దపీఠ వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లో మూడేళ్ల కంటే ఎక్కువగా పని చేస్తున్న కొందరు ఏఈలు, ఏడీఈలను గత ఏడాది యాజమాన్యం బదిలీ చేసింది. అయితే వారు ఇప్పటి వరకు అక్కడి నుంచి రిలీవ్‌ కాకపోవడాన్ని పరిశీలిస్తే డిస్కంలో బదిలీల పక్రియ ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే సర్కిల్‌లోని ఓ ఏఈ, మరో ఏడీఈ బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా యాజమాన్యం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు.

>
మరిన్ని వార్తలు