ఊసేలేని కాళేశ్వరం జాతీయ హోదా

6 Jul, 2019 04:25 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌లో మొండిచెయ్యి.. రాష్ట్రం ఆశలపై నీళ్లు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగునీటిని అందించే ప్రాజెక్టుకు నిధులిచ్చి ఆదుకోవాలని కోరినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన రాలేదు. బడ్జెట్‌ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో జూన్‌ 21 జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ప్రభుత్వం తరఫున ఈ భేటికీ హాజరైన ఆర్థిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.88 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటి లో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా సమీకరించిన అప్పులేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. జూన్‌ 24న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రసంగించిన టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా జాతీయ హోదాకై డిమాం డ్‌ చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావన చేయలేదు. జాతీయ హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఈ అంశాలను సైతం పక్కనపెట్టింది. ప్రధానమంత్రి కృషి సించయ్‌ యోజన కింద రాష్ట్రం నుంచి 11 ప్రాజెక్టులకు నిధులు అందాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు