అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా

2 Dec, 2014 08:32 IST|Sakshi
అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు టి.రాజయ్య ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే వైద్య సిబ్బంది ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని... ఆ సమస్యకు త్వరలో పరిష్కరిస్తామని టి.రాజయ్య తెలిపారు. తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య సోమవారం రాత్రి నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో నిద్రపోయిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఉదయం రాజయ్య ఆస్పత్రి నుంచి తన వాహన కాన్వాయితో బయలుదేరిన సమయంలో ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా జీతాలు అందడం లేదని ఆందోళనకు దిగారు. అలాగే తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తానని రాజయ్య కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు