జూలై 6 నుంచి ఎంసెట్‌

24 May, 2020 01:41 IST|Sakshi

అదే నెలలో అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా చర్యలు 

తాజా షెడ్యూల్‌ జారీచేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల దరఖాస్తు గడువు జూన్‌ 10..: పాపిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్ ‌: జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జూలైలోనే ఇతర అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. శనివారం హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపైనా, ప్రవేశ పరీక్షలపైనా చర్చించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా నిబంధనలకు లోబడి, యూనివర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడిం చారు. పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామం డలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌మిట్టల్, మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్‌కు 6.. అగ్రికల్చర్‌కు 3 సెషన్లు
జూలై 6 నుంచి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షల్లో భాగంగా ముందుగా ఆరు సెషన్లలో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 6, 7, 8 తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఉంటుందన్నారు. ఇక 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అగ్రికల్చర్‌ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే 10న ఉదయం సెషన్‌ కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. 10న జరిగే లాసెట్‌కు విద్యార్థులు తక్కువే ఉంటారు కాబట్టి ఆ సదుపాయాలను కూడా దీనికి వినియోగించుకుంటామని చెప్పారు. ఇక రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్‌లో 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఎంసెట్‌కు 2,10,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,35,974 మంది ఇంజనీరింగ్‌ కోసం, 74,567 మంది అగ్రికల్చర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టŠస్‌ దరఖాస్తుల గడువు వచ్చే నెల పది వరకు పెంచినట్టు పాపిరెడ్డి తెలిపారు. జూన్‌ 20 నుండి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామని, మొదట  ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు, ఇవి ముగిసిన వారం తర్వాత బ్యాక్‌ లాగ్స్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు