రేపటి నుంచి ఎంసెట్‌

2 May, 2019 03:06 IST|Sakshi

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌–2019 ఆన్‌లైన్‌ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు ఎంసెట్‌ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 18 పట్టణాల పరిధిలోని 94 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసింది. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. అందులో రెండింటికీ హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. దరఖాస్తుదారుల్లో ఈసారి ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారిలో నలుగురు ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు హాజ రు కానుండగా, ఒకరు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి..
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికికంటే గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు చివరి క్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొదటి విడత పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా ఆ పరీక్షకు ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్ష కోసం విద్యార్థులను 1:30 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు.

అగ్రికల్చర్‌ కోర్సులవైపు బాలికల మొగ్గు
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అత్యధికంగా బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ కోసం బాలురు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు బాలికలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు 87,804 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా, 54,410 మంది బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బాలురు 23,316 మంది దరఖాస్తు చేసుకోగా, బాలికలు 51,664 మంది దరఖాస్తు చేసుకున్నారు.

విద్యార్థులకు సూచనలు
∙విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకోవాలి. పరీక్ష రోజు ఇబ్బంది పడకుండా వీలైనంత ముందుగా చేరుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి.
∙పరీక్ష హాల్లోకి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం, బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే అటెస్ట్‌ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి.
∙విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే తమ బయోమెట్రిక్‌ డేటాను నమోదు చేసుకోవాలి.
∙హాల్‌టికెట్‌ లేకుండా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి, హాల్లోకి అనుమతించరు.
∙విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి.
∙పరీక్ష ప్రారంభం అయ్యాక వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష హాల్లోకి అనుమతించరు. వచ్చిన వారిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు.
∙కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్‌ లాగ్‌ టేబుల్స్, పేపర్లు, సెల్‌ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ నిషేధం. వాటిని పరీక్ష హాల్లోకి తీసుకెళ్లకూడదు. రఫ్‌ వర్క్‌ కోసం బుక్‌లెట్‌ను పరీక్ష హాల్లోనే అందజేస్తారు. ఆ బుక్‌లెట్‌ను తర్వాత ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు.

 స్ట్రీమ్‌                   ఇంజనీరింగ్‌    అగ్రికల్చర్‌ ఫార్మసీ
         
విద్యార్థుల సంఖ్య    1,42,218        74,981
బాలురు                  87,804        23,316
బాలికలు                 54,410        51,664
ట్రాన్స్‌జెండర్స్‌              4                       1

 

మరిన్ని వార్తలు