సెకండ్స్‌ హ్యాండ్‌ ఇస్తున్నారు

30 Nov, 2018 01:06 IST|Sakshi

ప్రలోభాలతో పార్టీలు మారుతున్న వైనం..

టెన్షన్‌లో ఇరు పార్టీల అభ్యర్థులు

అభ్యర్థులకు ద్వితీయశ్రేణి నేతల ఝలక్‌

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులకు కుడిభుజాలుగా ఉన్నవారు, కీలకమైన అనుచర వర్గం ఇప్పుడు తమ నేతలకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారు.అటు వైపు నుంచి ఇటు, ఇటు వైపు నుంచి అటు.. పార్టీల్లోకి జంప్‌ చేస్తూ టెన్షన్‌ పెట్టిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నా అప్పటికప్పుడు పార్టీలు మారిపోవడం ఒక అంశంగా ఉంటే, గతంలో ఏళ్ల పాటు ఒక పార్టీలో ఉండీ అధికార పార్టీలోకి వలస వెళ్లిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. దీనితో అభ్యర్థుల్లో  ఆందోళన నెలకొంది. దీంతో కొంత మంది అభ్యర్థులు తమ అనుచరులను గడ్డాలు పట్టుకొని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. 

నిన్నటి వరకూ  ఇటు..  ఇప్పుడు అటు..
ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లిన కొంత మంది మాజీ జెడ్‌పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌లో ఉండి నిన్నా మొన్నటి వరకు పదవులు పొంది, పనులు చేసుకున్న నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులతో చెడి కాంగ్రెస్‌లోకి వలసపోతున్నారు. ఇందులో ప్రధానంగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు కుడిభుజాలుగా ఉన్న వారు సైతం వలస వెళ్లడం, అభ్యర్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందులోనూ కొంత ఆర్థిక బలం, సామాజిక వర్గం, ఆ నియోజకవర్గంలోకి ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారుండటంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో పడిపోతు న్నారు.మరికొన్ని చోట్ల పార్టీలో ఉండి కూడా నయాపైసా సంపాదించుకోకుండా అసంతృప్తిగా ఉన్న వాళ్లు సంబంధిత ఎమ్మెల్యేపై కోపంతో పార్టీ మారుతున్నారు. ఇక మూడో రకం నేతలు కేవలం డబ్బుల కోసం లొంగిపోవడం రెండు ప్రధాన పార్టీలను వేధిస్తున్నాయి.దీని వల్ల కొన్ని చోట్ల భారీ స్థాయిలో ఓట్లకు గండిపడుతుండటం, మరికొన్నిచోట్ల ఓట్ల చీలిక రానుందని, గెలుపు ఓటములను నిర్ణయించడంలో అభ్యర్థుల కుడిభుజాలు ప్రభావం చూపిస్తారని వారు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఐదు రోజులే కీలకం...
ఎన్నికలకు  సరిగ్గా వారం రోజులే ఉండటంతో అనుచరులకు రెండు పార్టీలు గాలం వేసే పనిలో పడ్డాయి. కొంత మందికి కార్లు బహూకరించగా, మరికొంత మందికి రూ.10లక్షల నుంచిరూ.20లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నారు. అదే విధంగా మరికొంత మందిని ఏకంగా దుబాయి, థాయ్‌లాండ్, మలేషియా ట్రిప్పులకు పంపించడంతో పాటు ఇంట్లో మహిళలకు 20తులాల మేర బంగారం కానుకగా ఇస్తున్నారు.ఇందులో ప్రధానంగా ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 50మంది వరకు ప్రజాప్రతినిధులు ఇటీవలే కొంతమందిని పుణ్యక్షేత్రాలకు పంపారు. మరికొంత మంది గోవా, కేరళ పర్యటనలకు వెళ్లివచ్చారు.అదే విధంగా మహబూబ్‌నగర్, నల్గొండలోని 8 నియోజకవర్గాల్లో మాజీ ఎంపీ టీసీలు, జెడ్‌పీటీసీలు బ్యాంకాక్‌ వెళ్లిరావడం చర్చనీయాంశంగా మారిం ది.ఎన్నికలకు సరిగ్గా వారం రోజులే ఉండటంతో అనుచరులను జాగ్రత్త గా కాపాడుకోవడం కోసం వారికి రోజు వారీ ఖర్చులతో పాటు కీలక బాధ్యతలు అప్పగించి నమ్మకం కల్గించుకుంటున్నారు. ఏమాత్రం నొప్పించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కొద్ది తేడా వచ్చినా ప్రత్యర్థి పార్టీలోకి మారిపోయేందుకు ద్వితీయ శ్రేణి నేతలు బేరసారాలు బహిరంగంగానే చేస్తుండటం అభ్యర్థుల్లో   ఉత్కంఠ రేకెత్తిస్తోంది.  

మరిన్ని వార్తలు