పల్లె, పట్నం  కలగలుపు ఎవరిదో  తుది గెలుపు?

30 Nov, 2018 00:17 IST|Sakshi

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా.. రాష్ట్రంలో ఏ కొత్త పార్టీ ఏర్పాటైనా అంకురార్పణ జరిగేదిక్కడే. మారుతున్న రాజకీయ పరిస్థితులను, అనివార్యతలను అర్థం చేసుకొని ముందుకెళ్లే ఈ జిల్లా ప్రజానీకమే ప్రభుత్వ ఏర్పాటుకు దిక్సూచి. రియల్‌ ఎస్టేట్, పారిశ్రామికాభివృద్ధితో రాష్ట్రంలోని సగానికిపైగా ఆర్థిక సంపద ఉండేదీ.. ప్రయాణ సౌకర్యం సైతం లేని వెనుకబడిన పల్లెలు ఉండేదీ ఇక్కడే. నగర, గ్రామీణ ఓటర్ల కలబోతతో మిశ్రమ రాజకీయ వ్యూహాలను ప్రస్ఫుటించే ఈ జిల్లాకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడి ప్రజల తీర్పే కీలకం. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి వంటి ప్రముఖులు ఈ జిల్లావాసులే. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచినా రంగారెడ్డిలో నామమాత్రమే. ఉమ్మడి రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 2, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈసారి పరిస్థితి మారింది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఇపుడు టీఆర్‌ఎస్‌ తరపున బరిలో దిగితే, గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారిలో మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రమే ఇప్పుడు పోటీలో ఉన్నారు. జిల్లాలోని 7 గ్రామీణ నియోజకవర్గాలపై గ్రౌండ్‌ రిపోర్ట్‌..

తాండూరు: సై అంటే సై
టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి (కాంగ్రెస్‌) మధ్యే ప్రధాన పోటీ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం. నారాయణ్‌రావుపై 16,074 ఓట్ల మెజారిటీతో మహేందర్‌రెడ్డి గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీఆర్‌ఎస్‌లో చేరి మహేం దర్‌రెడ్డి పోటీలో దిగారు. దీంతో అప్పటి వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న రోహిత్‌రెడ్డికి అవకాశం రాలేదు. ఆ ఎన్నికల తర్వాత యంగ్‌ లీడర్స్‌ సంస్థ తరపున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టిన పైలెట్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరి, కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే మహేందర్‌రెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పైలెట్‌ రోహిత్‌రెడ్డి మొదటిసారి బరిలో దిగారు. ఇక బీజేపీ తరపున పటేల్‌ రవిశంకర్‌ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యే ఉండనుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మహేందర్‌రెడ్డి ముందుకు సాగుతుంటే.. నియోజవకర్గంలో తాను చేసిన సేవా కార్యక్రమాలు, గ్రామ గ్రామాన వివేకానంద విగ్రహాల ఏర్పాటు, యువత రాజకీయాల్లో రావాలంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భరోసాతో రోహిత్‌రెడ్డి ఉన్నారు. 

చేవెళ్ల: కాంగ్రెస్‌ – టీఆర్‌ఎస్‌ పోటాపోటీ
మాజీ హోం మంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలు పొందారు. ఆయన మరణానంతరం భార్య సబిత ఇక్కడి నుంచి ఎన్నికై వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో హోం మం త్రిగా పని చేశారు. 2009లో ఈ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో కేఎస్‌ రత్నం (టీడీపీ).. యాదయ్య (కాంగ్రెస్‌)పై గెలు పొందారు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కాలే యాదయ్య.. కేఎస్‌ రత్నం (టీఆర్‌ఎస్‌)పై 781 ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఈసారి యాదయ్య టీఆర్‌ఎస్‌ నుంచి.. రత్నం కాంగ్రెస్‌ నుంచి తలపడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని యాదయ్య.. ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలమైన కేడర్, కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తి తనను కలిసొస్తాయని రత్నం నమ్మకంతో ఉన్నారు.  కంజర్ల ప్రకాష్‌ (బీజేపీ), సునీల్‌కుమార్‌ (బీఎస్‌పీ) కూడా పోటీలో ఉన్నారు.

పరిగి: ఇద్దరి మధ్యే పోటీ
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి బరిలో నిలవగా, టీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయ కురువృద్ధుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కుమారుడు మహేశ్‌రెడ్డి తొలిసారి పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు, తన తండ్రి రాజకీయ అనుభవం, తన సతీమణి ప్రచార సరళి, పార్టీ కేడర్‌ బలంగా ఉండటంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిలో గెలుపు ధీమా కనిపిస్తోంది. వివాదరహితునిగా ఉన్న పేరుకు తోడు సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేకత తనను గెలిపిస్తాయన్న ధీమాతో తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. సాగునీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వ తాత్సారం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న 300 వరకు తండాల్లోని ఓట్లు కీలకం కానున్నాయి. గుడుంబా అమ్మకాల కేసుల నమోదుపై వీరిలో వ్యతిరేకత ఉంది. వేల మందిపై కేసులు ఉంటే 160 మందికి మాత్రమే పునరావాసం కల్పించడంపై ఎస్టీల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. బహుజన్‌ ముక్తి పార్టీ నుంచి పోటీలో ఉన్న గట్లానాయక్‌ ఎస్టీల ఓట్లను కొంత మేర చీల్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌రావు యువతను తమవైపు తిప్పుకోవడంతో ఈసారి ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరగచ్చు.

మహేశ్వరం : సబిత వర్సెస్‌ తీగల
తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (టీఆర్‌ఎస్‌), ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్‌) ఇక్కడ పోటీలో ఉన్నారు. తీగలకు వివాదరహితునిగా పేరున్నా ఆయన హయాంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారం పూర్తి చేసిన కృష్ణారెడ్డి మూడోసారి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భరోసాతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకు, గతంలో ఎమ్మెల్యేగా తను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయన్న ధీమాతో సబిత ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని ఆమె భావిస్తున్నారు. ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్‌ కూడా అలుపు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు.

వికారాబాద్‌: ముగ్గురి మధ్య ఉత్కంఠ పోరు
వికారాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ.. టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్‌ ఇవ్వకుండా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు అవకాశమిచ్చింది. మరోవైపు ఎ.చంద్రశేఖర్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదు. ఆయనకు బదులు గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఇవ్వడంతో చంద్రశేఖర్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ క్రమంలో సంజీవరావు కూడా టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి చంద్రశేఖర్‌ తరపున ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసకందాయంలో పడింది. అయితే ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంటే కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులే ప్రచారంలో ముందున్నారు. ప్రధాన పోటీ వారిద్దరి మధ్యే ఉంది. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా, విద్యావేత్తగా చంద్రశేఖర్‌కు పేరుంది. ఆయన విద్యా సంస్థల్లో పిల్లలను చదివించిన ప్రతి గ్రామంలో అనేకమంది తల్లిదండ్రులతో పరిచయాలు ఉండటం తనకు మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారు. అలాగే, తన విద్యాసంస్థల్లో చదివే పిల్లల ఫీజుల విషయంలో ఆయన సానుకూలంగా ఉండేవారనే పేరుంది. ఇక నియోజకవర్గంలో ప్రజలందరికీ పాస్‌ బుక్కులు, రైతుబంధు చెక్కులు అందకపోవడం, అసంతృప్తి తనను గెలిపిస్తాయని కూటమి తరఫున పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రసాద్‌కుమార్‌ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు తనను బయట పడేస్తాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆనంద్‌ భావిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం: చీలే ఓటు.. ఎవరికో లాభం?
ఇబ్రహీంపట్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి (ప్రజా కూటమి) పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) తరఫున పోటీలో దిగారు. సామ రంగారెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. ప్రధాన పోటీ మల్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మధ్యే ఉంది. గతంలో ఓడిపోయారన్న సానుభూతి మల్‌రెడ్డికి కొంత ఉంది. ఆ సానుభూతితోపాటు తన హయాంలో చేసిన అభివృద్ధి తనకు మేలు చేస్తుందని, మరోవైపు బలమైన కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ తన గెలుపునకు దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హవా కలిసివస్తాయని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన క్యామ మల్లేష్‌ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కొంత వరకు మారాయి. కాంగ్రెస్‌ పార్టీలోని మల్లేశ్‌ వర్గం ఓట్లు మల్‌రెడ్డికి పడతాయా? కిషన్‌రెడ్డికి పడతాయా? అన్నది ఆసక్తికరం. రంగారెడ్డి మాత్రం 2.5 లక్షల ఓట్లలో సగం ఓట్లు కలిగిన హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాలపై దృష్టిపెట్టి ప్రచారం చేస్తున్నారు. పగడాల యాదయ్య (బీఎల్‌ఎఫ్‌) మంచాల మండలంలో కొన్ని ఓట్లు చీలుస్తారని అంచనా. చివరకు చీలిక ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.

మేడ్చల్‌: ముగ్గురి హల్‌చల్‌
మేడ్చల్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఓటర్లను ప్రభావితం చేసే అభ్యర్థులు నలుగురు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యే ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్‌ తరఫున కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నక్క ప్రభాకర్‌గౌడ్‌ బీఎస్‌పీ నుంచి పోటీకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఇక్కడ టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇవ్వలేదు. ఆయన వర్గీయులు సహకరించే పరిస్థితిని బట్టి టీఆర్‌ఎస్‌ గెలుపోటములు ఉండనున్నాయి. ప్రభాకర్‌గౌడ్‌ కారణంగా టీఆర్‌ఎస్‌ ఓట్లు కొంత చీలే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి కొన్ని మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆయనకు ప్రధాన ప్రచారాస్త్రాలు కాగా ఉద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత తనకు  మేలు చేస్తుందని కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి భావిస్తున్నారు. 

‘రంగారెడ్డి’.. మదిలో ఏముంది?
► పరిగి, చేవెళ్లకు సాగునీటి సదుపాయం.. 2.70 లక్షల ఎకరాలకు సాగునీటిని     అందించడం
► వికారాబాద్‌–పరిగి–కొడంగల్‌–మక్తల్‌     రైల్వే లైన్‌ ఏర్పాటు
► తాండూరు నాపరాయి పరిశ్రమలో     పనిచేసే కార్మికులకు వైద్య సదుపాయం
►వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌లో కలపడం..
►   జిల్లా కేంద్రం వికారాబాద్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడం.. రోడ్ల విస్తరణ.. రూ.3 వేల కోట్లతో శాటిలైట్‌ టౌన్‌ ఏర్పాటు.. 
►   హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో గల ఉద్యోగుల ఐఆర్‌ విషయం ప్రస్తావన..
►మూడో దశలో కృష్ణా జలాలను ఇబ్రహీంపట్నం చెరువుకు తరలించి వ్యవసాయానికి సాగునీటిని అందించడం
►  మేడ్చల్‌ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారం.

రైతులు, వలస కార్మికులు,  ఉద్యోగులే కీలకం
జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలైన తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చెల్‌లో రైతులు, వలస కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల ఓట్లే కీలకం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాధారిత వ్యవసాయం ప్రధానా«ధారమైతే.. సెమీ అర్బన్‌లో వలస కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులే అత్యధికం. వారే ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు. తాండూరు కంది పంట, నాపరాయి, సిమెంటు పరిశ్రమకు కీలకమైతే పరిగి, వికారాబాద్, చేవెళ్ల పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గాలే. ఇక మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌ నియోజకవర్గాలు సెమీ అర్బన్‌. ఇక్కడ రియల్‌ ఎస్టేట్, వలస కార్మికులు, ఉద్యో గుల ఓట్లే గెలుపోటములను నిర్ధారించనున్నాయి. ఈసారి ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో సాగునీటి వసతి కల్పన, విద్య, వైద్య సదుపాయం వంటి హామీలే కీలకం కానున్నాయి. వికారాబాద్, పరిగి వరకు వచ్చేలా డిజైన్‌ చేసిన ప్రాణహిత–చేవెళ్లను రీడిజైన్‌లో పరిమితం చేసి, పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని ఇస్తామన్న ప్రభుత్వం కేటాయింపులే జరపలేదని రైతులు అంటున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ఎక్కువ మంది తమకు ఐఆర్‌ ఇవ్వకపోగా, ఎక్కువ వేతనాలు ఉన్నాయంటూ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 

ఆదుకుంటారని ఎదురుచూపు
ఇతని పేరు వెంకటయ్య. చేవెళ్ల నియోజకవర్గం ద్యామెరగిద్దె గ్రామం. గొర్రెలను పెంచుతూ జీవనం గడుపుతున్నాడు. అయితే తను యాదవుడిని కాకపోవడంతో గొర్రెలు ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చి ఉంటే తన జీవనం మరోలా ఉండేదని అంటున్నాడు. అలాగే, తనకు పెన్షన్‌ మంజూరు చేస్తే.. ఈ వయసులో ఆసరాగా ఉంటుందని అన్నాడు. 

కౌలు రైతులకు సహాయం చేయాలి 
రైతుబంధు డబ్బు వచ్చింది. అయితే మాకు కొద్దిగానే భూమి ఉంది. కాబట్టి తక్కువ మొత్తం వచ్చింది. ప్రభుత్వం కౌలు చేసుకునే రైతులకు కూడా రుణమాఫీ లేదా మరో రూపంలో ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది. ఈ విషయం సర్కార్‌ ఆలోచించాలి.
– అజ్మీర్, పరిగి

పెంచిన పెన్షన్‌  ఆదుకుంటోంది
ప్రభుత్వం పెన్షన్‌ను పెంచడం వల్ల ఇబ్బందులు తగ్గాయి. అంతకుముందు రూ. 200 ఉన్నపుడు ఖర్చులకు సరిపోయేవి కావు. ఈ ప్రభుత్వం పెన్షన్‌ను పెంచి ఇవ్వడం వల్ల ఎవరినీ డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వడం కూడా ఎంతో ఉపయోగపడుతోంది.
   – కుమ్మరి పాపయ్య, కేసారం

ఇల్లు కావాలె..
నేను ఒంటరిని. పిల్లలు ఎవరూ లేరు. ఒక్క దానినే కిరాయి ఇంట్లో ఉంటున్నా.. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం ఇల్లు ఇస్తదని చూస్తున్నా. ఇప్పుడైనా ఇస్తరా?. గతంలో పెన్షన్‌ వచ్చినా డబ్బులు సరిపోయేటివి కావు. ఇప్పుడా ఇబ్బంది లేదు.
– బుగ్గమ్మ, ఆగపల్లి, మంచాల మండలం 

రైతుబంధుతో  ఎంతో ఉపయోగం
రైతుబంధు పథకం కింద మొదటి విడత డబ్బు వచ్చింది. పెట్టుబడి సమయంలో ఉపయోగపడ్డాయి. అయితే మండలంలో అందరికి పాస్‌ పుస్తకాలు రాలేదు. వాటిని వెంటనే ఇచ్చి, అందరికి పథకం ద్వారా మేలు చేయాలి. ఎన్నికల్లో మమ్మల్ని పట్టించుకునే అభ్యర్థులకే ఓట్లు వేస్తాం. 2014లో గెలిచిన ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదు.
– పుణ్యానాయక్, వికారాబాద్‌

ఇల్లు కట్టిస్తే మేలు 
పేదలకు త్వరగా ఇళ్లు మంజూరు చేయాలి. గతంలో నాకు ఇల్లు మంజూరైనా మధ్యలోనే ఆగిపోయింది. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె చెల్లించేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇందిరమ్మ ఇల్లు కాకపోయినా మరో పథకం పేరుతో అయినా ఇళ్లను మంజూరు చేయాలి. 
– దస్తప్ప, కరన్‌కోట్‌ 

మరిన్ని వార్తలు