పొత్తుల చుట్టూ.. విపక్షాల అభ్యర్థిత్వాలు

16 Sep, 2018 07:06 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ వైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఊరూరా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష  పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థును ఖరారు చేయక మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఇన్నాళ్లూ వ్యవహరించిన కాంగ్రెస్‌తో ఆయా పార్టీలు ఎన్నికల పొత్తులకు వెళ్లనుండడంతో అభ్యర్థుల ఖరారు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను టీఆర్‌ఎస్‌ పది స్థానాల్లో టికెట్లు ఖరారు చేసింది.

కోదాడ, హుజూర్‌నగర్‌లలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలన్నీ తాము పోటీ చేసే స్థానాలు, అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో ఇంకా ఎటూ నిర్ణయించుకోలేదని అంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాయని ఆ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఎదురు చూస్తున్న సీపీఐ, టీడీపీ, టీజేఎస్, ఇంటి పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటన్న స్థానాలపై ఒక అవగాహనతో ఉన్నాయని, కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు అయితే, ఆ స్థానాలు తెలుస్తాయని, ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో.. ఎవరు ఎక్కడ ?
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుని దేవరకొండ, మునుగోడుల్లో పోటీ చేసింది. దేవరకొండలో గెలిచిన ఆ పార్టీ, మునుగోడులో మాత్రం ఓడిపోయింది. దేవరకొండలో సీపీఐ తరఫున గెలిచిన రవీంద్ర కుమార్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి మారారు. ఎస్టీ రిజర్వుడు స్థానమైన దేవరకొండలో సీపీఐకి నాయకత్వం కొరత ఉందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఆ పార్టీ జిల్లాలో కేవలం మునుగోడు మాత్రమే అడిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇక్కడినుంచి కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత ఎన్నికల్లో పార్టీ రెబల్‌గా పోటీచేసి పాల్వాయి స్రవంతి, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. వీరిద్దరే కాకుండా పున్న కైలాస్, నారబోయిన రవి యువత కోటాలో తమకు టికెట్‌ వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ, ఇక్కడ సీపీఐతో వ్యవహారం తేలితే కాని అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఉంది. కోదాడ, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, నల్లగొండలో సిట్టింగులు ఉన్నందున ఇక్కడ సమస్య కాకపోవచ్చని, మిర్యాలగూడలో కొత్తగా అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన భాస్కర్‌ రావు టీఆర్‌ఎస్‌లోకి మారడంతో ఈసారి ఇక్కడ మరొకరిని ఎంచుకోవాల్సి ఉందంటున్నారు. ఆలేరులో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్‌ ఒక్కరే రేసులో ఉన్నారు. భువనగిరి అభ్యర్థిత్వం విషయంలోనూ స్పష్టత లేదు. తుంగతుర్తిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్‌ ఈ సారి టికెట్‌ ఆశిస్తున్నా, ఆయనను స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోందని, దామోదర్‌రెడ్డి మొగ్గు ఎవరి వైపు ఉంటుందో వారికి టికెట్‌ దక్కొచ్చన్న సాధారణ అభిప్రాయం ఉంది. సూరాపేటలో గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్‌.దామోదర్‌ రెడ్డి ఈసారీ రేసులో ఉన్నారు.

టికెట్‌ హామీపైనే టీడీపీ సూర్యాపేట అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్‌ రమేష్‌రెడ్డి టికెట్‌ హామీపైనే రేవంత్‌రెడ్డితో కలిసి పార్టీ మారారు. ఆయనా టికెట్‌ కోరుతున్నారు. దీంతో ఇక్కడ పీఠముడి పడినట్లే. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆశిస్తూ .. ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే, ఇక్కడ మరో ముగ్గురు టికెట్‌ రేసులో ఉన్నారు. పొత్తంటూ కుదిరితే ఈ స్థానం తమకు కావాల్సిందేనని టీడీపీ గట్టిగా కోరుతోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ కోరే స్థానం కూడా ఇదేనని అంటున్నారు. కోదాడలో సిట్టింగ్‌ ఉన్నా, టీడీపీ ఈ స్థానాన్నీ కోరుతోంది. పొత్తుల విషయంలో ఏదో ఒకటి తేలితే కానీ ఈ స్థానాల్లో అభ్యర్థులు తేలేలా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ఒంటరిగా .. బరిలోకి !
వైఎస్సార్‌ కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ కూటమితో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. ఈ పార్టీలూ ఇప్పటి దాకా పోటీ చేసే స్థానాల విషయంలో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. బీజేపీ పన్నెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, ఆ మేరకు కార్యాచరణ సిద్ధం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులతో కాకుండా, సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తెలంగాణ జనసమితి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జిల్లాలో మిర్యాలగూడ స్థానాన్ని కోరనుందని చెబుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సైతం హుజూర్‌నగర్, సూర్యాపేట, నకిరేకల్, మిర్యాలగూడ తదితర స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. టికెట్ల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి దారికి తెచ్చుకునే పనిలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం నిమగ్నమైంది. మరోవైపు ఆ పార్టీ అభ్యర్థులు అసమ్మతి వర్గాల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారైతే కానీ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకోదని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు