కమలోత్సాహం

13 Sep, 2018 12:46 IST|Sakshi
రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌తో  టికెట్‌ గురించి చర్చిస్తున్న కటికె శ్రీనివాస్‌

సాక్షి, మెదక్‌: బీజేపీలో టికెట్ల పోరు మొదలైంది.  దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. వారు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు కూడగట్టేందుకు ఎవరికివారే పావులు కదుపుతున్నారు. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న నాయకుల వ్యూహా ప్రతివ్యూహాలతో బీజేపీలో అంతర్గత రాజకీయాలు వెడెక్కాయి.  బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనుంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టేందుకు కోసం నియోజవర్గాల వారీగా సర్వేలు  జరిపిస్తోంది.

సర్వేలో బలమైన నాయకులుగా తేలితేనే వారికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని పలవురు నాయకులు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్‌ జాబితా వెలువరించిన తర్వాతే బీజేపీ వారి జాబితా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కని నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కోసం త్వరలో రాష్ట్రానికి రానున్నారు. ఆయన ఈ ఎన్నికలపై ముఖ్యనేతలతో చర్చించటంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీంతో బీజేపీ ఆశావహుల చూపు అమిత్‌షా పర్యటనపై నెలకొంది. కాగా కొందరు నేతలు తమకున్న  పరిచయాల ద్వారా అమిత్‌షాను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

ముగ్గురి మధ్య పోటీ!
మెదక్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు ముగ్గురు టికెట్‌ ఆశిస్తున్నారు. ముందస్తు ఎన్నికల జరుగుతాయని తెలిసిన వెంటనే ఎవరికివారే ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు రామ్‌చరణ్‌యాదవ్, ఉపాధ్యక్షుడు కటికె శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్‌ మెదక్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తనకు టికెట్‌ ఇవ్వాలని రామ్‌చరణ్‌యాదవ్‌ కోరుతున్నాడు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటికె శ్రీనివాస్‌ టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసి టికెట్‌ ఇవ్వాల్సిందిగా కోరారు.  కాగా శ్రీనివాస్‌కు టికెట్‌ కేటాయింపు విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఆనుకూలంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్‌ తాను  పార్టీ కోసం ఎంతోకాలంగా పనిచేస్తున్నానని, ఈ మారు తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దల వద్ద గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో ముగ్గురిలో టికెట్‌ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

పక్క పార్టీ నేతల చూపు
నర్సాపూర్‌ ఎమ్మెల్యే టికెట్‌పై బీజేపీ నేతలతోపాటు పక్క పార్టీల నేతలు సైతం ఆశపడుతున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు గోపీ, రమేశ్‌గౌడ్‌తోపాటు ఇటీవల పార్టీలో చేరిన రఘువీరారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు.   ఇప్పటికే రఘువీరారెడ్డి టికెట్‌ తనకే ఖాయమన్న విశ్వాసంతో ఉన్నారు. కాగా బీజేపీ లో చేరేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నట్ల సమాచారం. హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ కూడా ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మదన్‌రెడ్డి పేరు ప్రకటించటంతో ఆమె బీజేపీ టికెట్‌ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే బీసీ మహిళా నేత సోమన్నగారి లక్ష్మి సైతం బీజేపీ టికెట్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది.

కమలోత్సాహం 

మరిన్ని వార్తలు