రైట్‌.. రైట్‌.. !

23 Sep, 2018 12:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా రేసు గుర్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పలు సర్వేల ఫలితాలే కాకుండా స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు కావడంతో వారందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు విపక్షాలు మహాకూటమిగా బరిలో నిలవాలనే నిర్ణయానికి వచ్చినా సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి రాకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.

సందిగ్ధత 
విపక్ష పార్టీలన్ని కలిసి మహాకూటమిగా ఎన్నికల బరిలో నిలవడానికి కసరత్తు చేస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే కాస్త స్పష్టత ఉంది. అంతేకాదు పార్టీ ఆధ్వర్యాన దరఖాస్తులు ఆహ్వానించగా సిట్టింగ్‌లు ఉన్న చోట ఇతరులెవరూ పెద్దగా పోటీకి రాలేదు. దీంతో తాజా మాజీలకే కాంగ్రెస్‌ తరఫున టికెట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొడంగల్, గద్వాల, అలంపూర్‌తో పాటు కల్వకుర్తి విషయంలో స్పష్టత వచ్చేసినట్లయింది. అయితే, అధికారికంగా మాత్రం పేర్లు ప్రకటించలేదు. ఇక మహాకూటమి ఏర్పాటు కానున్న నేపథ్యంలో టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు జిల్లా నుం చి కొన్ని స్థానాలను కోరుతున్నాయి. అదే విధంగా కూటమి, మిత్రపక్షాలతో సంబంధం లేకపోయినా నారాయణపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలలో బరిలో నిలిచే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

గద్వాల 
ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం గద్వాల. ఇక్కడి నుంచి వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే.అరుణ గెలుపొందడం.. రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదగడంతో టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్‌కు బలంగా ఉన్న నియోజకవర్గాన్ని ఢీకొట్టాలని టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి టికెట్‌ కేటాయించిన అధిష్టానం.. అసమ్మతి నేతలను సైతం దారిలో పెడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున డీకే.అరుణ బరిలో నిలవడం దాదాపు ఖరారు కావడంతో.. ఆమె కూడా ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్‌కు కంచు కోటలా తయారైన గద్వాలలో మరోసారి జెండా ఎగురవేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఈసారి బీజేపీ కూడా బరిలో నిలవాలని కసరత్తు చేస్తోంది. అందుకోసం రాజవంశానికి చెందిన వెంకటాద్రిరెడ్డిని పోటీలో దించాలని అధిష్ఠానం యోచిస్తోంది.

అలంపూర్‌ 
నడిగడ్డకు చెందిన మరో కీలకమైన నియోజకవర్గం అలంపూర్‌లో ఈసారి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌కు టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి ఆర్డీఎస్‌లో ఈఈగా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్న వరప్రసాద్‌ కూడా టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ తాజా మాజీ కావడంతో సంపత్‌కే టికెట్‌ దక్కొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహంకు టికెట్‌ ఖరారు కాగా ఆయన ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడి నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున జెట్టి రాజశేఖర్‌ బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌కు ఆనుకుని ఉండడం.. వైఎస్సార్‌సీపీ కాస్త పటిష్టంగా ఉండడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అలంపూర్‌లో త్రిముఖ పోరు నెలకొంటుందని చెప్పొచ్చు.
 
కల్వకుర్తి 
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే కల్వకుర్తిలో ఈసారి పోరు రసవత్తరంగా మారుతోంది. గతంలో ఎన్టీ.రామారావును ఓడించడంతో పాటు 2014 ఎన్నికల్లో కేవలం ఈవీఎం లు మొరాయించడం, మళ్లీ నిర్వహించిన పోలింగ్‌లో కేవలం 74 ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందడం వంటి అంశాలు ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అయితే ఈసారి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొనే అవ కాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదా పు ఖరారైనట్లే. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌ బరిలో నిలవాలని యోచిస్తున్నా... వంశీచంద్‌ తాజా మా జీ కావడంతో మరోసారి అవకాశం లభించొ చ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్‌ఎస్‌ తరఫున ఇది వరకే మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టికెట్‌ ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ తరఫున తన్నోజు ఆచారి బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. బీజేపీ తరఫున ఆచారి గత నాలుగు పర్యాయాలుగా పోటీ చేయడం, గత ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో ఈసారి విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో ముమ్మర కసరత్తు చేస్తున్నారు.  

కొడంగల్‌ 
మహబూబ్‌నగర్, వికారాబాద్‌ జిల్లాలో పరిధిలో ఉన్న కొడంగల్‌ నియోజకవర్గంలో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డికి టికెట్‌ ఖరారు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గం మొత్తంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో తమకు కొరకరాని కొయ్యలా తయారైన రేవంత్‌రెడ్డిని ఈసారి ఎలాగైనా మట్టి కరిపించాలని కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున రేవంత్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖరారైంది.

సిట్టింగ్‌ అభ్యర్థి కావడంతో పాటు ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానం దరఖాస్తులు ఆహ్వానించగా రేవంత్‌ నుంచి మాత్రమే దరఖాస్తు అందింది. దీంతో మరెవరి నుంచి పోటీ లేకపోవడంతో    ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చేసినట్లయింది. అదే విధంగా వైఎస్సార్‌సీపీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మళ్లి బాల్‌రాజ్, బీజేపీ నుంచి నాగూరావ్‌ నామాజీ పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీల అధిష్టానాలు ఆయా నేతలకు సూచనప్రాయంగా చెప్పేయడంతో పోటీలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా