పోటీ చేసేవాళ్లెక్కువ..! పోలింగ్ తక్కువ...!!

10 Dec, 2018 16:50 IST|Sakshi

సాక్షి వెబ్, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు ఎక్కువ ఓట్లు వేయించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అనేక రకాలుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ఒక నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిస్తే వారంతా ఎవరి ప్రయత్నాల్లో వారుంటారు. ఓటింగ్ పెంచుకోవడానికి తెగ తాపత్రయ పడుతారు. నలుగురు పోటీలో ఉన్న చోట ఇలా ఉంటే... అదే నలభై మంది ఉన్న చోట ఎలా ఉండాలి. కచ్చితంగా పోలింగ్ ఎక్కువగా నమోదు కావాలి. కానీ అలా జరగడం లేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు గమనిస్తే... అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో అత్యధిక పోలింగ్ జరగాలి. కానీ ప్రతిసారీ రివర్స్ లో నగరాల్లోనే తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనిస్తూనే ఉన్నాం.

తాజా ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ పడిన తీరు, అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లోనే పోలింగ్ తక్కువ కావడం గమనార్హం. ఉదాహరణకు మల్కాజిరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటీ చేస్తున్న వారంతా ప్రచారం చేసుకోవడంతో పాటు పెద్దఎత్తున ఏజెంట్లను రంగంలోకి దింపారు. కానీ విచిత్రమేమంటే... రాష్ట్ర వ్యాప్తంగా అతితక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాల్లో మల్కాజిరిగి కూడా ఉంది. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో మాత్రమే 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అయితే, ఈసారి 69 స్థానాల్లో పోలింగ్ శాతం 80 దాటింది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినప్పటికీ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. తెలంగాణలో ఎస్సీ (19), ఎస్టీ (12) నియోజకవర్గాలు మొత్తం 31 స్థానాల్లో పోలింగ్ సరళి చూస్తే 26 నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. కేవలం అయిదు చోట్ల మాత్రమే అంతకన్నా తక్కువ పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) స్థానంలో అతితక్కువగా 49.05 శాతం పోలింగ్ నమోదైంది.

ఇకపోతే, ఒక్కో నియోజకవర్గంలో 20 మంది అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలు 22 ఉన్నాయి. మల్కాజిగిరి (42), ఎల్బీ నగర్ (35), ఉప్పల్ (35), ఖైరతాబాద్ (32), అంబర్ పేట్ (31), శేరిలింగంపల్లి (29), సికింద్రాబాద్ (29), రాజేంద్ర నగర్ (26), ముషీరాబాద్ (26), గోషామహల్ (25), యాకుత్ పుర (21), కుత్బుల్లాపూర్ (20), కూకట్ పల్లి (20), ఇబ్రహీంపట్నం (20), మలక్ పేట్ (20) చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం మాత్రం అతితక్కువ నమోదైంది. 

మరిన్ని వార్తలు