కొత్త ఈవీఎంలొచ్చాయ్‌..

24 Sep, 2018 09:56 IST|Sakshi
ఈసీ గోదాములో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

సాక్షి ప్రతినిధి నిజామాబాద్‌: ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలుండటంతో జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్‌ నిర్వహణకు చక చక ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను చేపట్టిన ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాకు ఆదివారం కొత్త ఈవీఎంలు వచ్చాయి. బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) నుంచి 1,890 వీవీ ప్యాట్‌లు, 1,750 కంట్రోల్‌ యూనిట్లు, 2,240 బ్యాలెట్‌ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఎన్నికల సంఘం గోదాముకు చేరుకున్నాయి. వీటిని అధికారులు సరిచూసుకుని గోదాముల్లో భద్రపరిచారు. పోలీసుశాఖ ఇక్కడ భద్రతను మరింత పెంచింది. కొత్తగా వచ్చిన ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.రామ్మోహన్‌రావు పరిశీలించారు. పొలింగ్‌లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు ఎన్నికల సంఘం ఈసారి వీవీ పీఏటీ (ఓటరు వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) యూనిట్లను సపోర్టు చేయగల ఈవీఎంలను వినియోగించాలని నిర్ణయించిన విషయం విదితమే.

జిల్లాలో ఉన్న పాత ఈవీఎంలు వీవీ ప్యాట్‌లకు సపోర్టు చేయవు. దీంతో పాత ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్‌ యూనిట్లకు సపోర్టు చేయగల అప్‌డేటెడ్‌ ఈవీఎంలను వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో ఉన్న పాత ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బీఈఎల్‌ సంస్థలకు పంపాలని రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి ఆదేశాలందాయి. దీంతో గత ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల పోలింగ్‌ కోసం వి నియోగించిన 20,826 పాత ఈవీఎంలను ఈసీఐఎల్, బీఈఎల్‌లకు పంపుతున్నారు. ఇటీవల 3,400 పాత ఈవీఎంలను ఆయా సంస్థలకు పం పారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపనున్నారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్‌ యూనిట్లు సపోర్టు చేయగల అప్‌డేటెడ్‌ ఈవీఎంలను తెప్పిస్తున్నారు. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,142 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఎన్నికలకు అ వసరమైన యూనిట్లు సమకూర్చుకుంటున్నారు.

ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు: కలెక్టర్‌ 
ఓటరు జాబితాలో పేరు లేని వారు పేరు నమోదు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే గడువు ఉందని, 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు ద్వారానే మంచి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, ఇప్పటికే ఓటరు కార్డు ఉన్నవారు జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని, నివాస ప్రాంతం, చిరునామా, నియోజక వర్గాలు వంటి వాటిల్లో ఏమైనా మార్పులుంటే సరిచేయించుకోవాలని తెలిపారు. మరణించిన వారు, డూప్లికేట్‌ పేర్లుంటే తొలగించుకోవాలని కోరారు. ఓటర్ల వివరాలను  ఠీఠీఠీ. nఠిటp. జీn వెబ్‌సైట్‌లో సరిచేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు