నేడే నామినేషన్ల సమర్పణకు చివరి రోజు

19 Nov, 2018 07:12 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు సోమవారం (నేడు) చివరి రోజు. మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల, ఇతర పార్టీల వారు సోమవారం నామినేషన్‌ సమర్పించేందుకు సమాయత్తమవుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, ఖమ్మం నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, ఇంకా మహా కూటమి మద్దతుతో నామా నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు.

ఇంకా బీఎల్‌ఎఫ్‌–సీపీఎం కూటమి నుంచి పోటీ చేస్తున్న ఖమ్మం, పాలేరు అభ్యర్థులు పాల్వంచ రామారావు, బత్తుల హైమావతిలు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ 19వ తేదీ (సోమవారం)తో ముగియనుంది. ఇన్నిరోజులుగా అధికారులు నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకున్నారు. చివరిరోజు కూడా ఇదే సమయాన్ని పాటించనున్నారు. గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు సరైన పత్రాలతో సంబంధిత కార్యాలయం లోపలికి చేరుకోవాల్సి ఉంటుంది.

సమయాన్ని మూడు గంటల వరకే కుదించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావాహులు తిరుగుబాటు అభ్యర్థులుగా, మరికొందరు స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గడువు ముగుస్తుండడంతో ఈ నెల 22వ తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల కమిషన్‌ గడువు విదించింది. నామినేషన్‌కు చివరిరోజు కావడంతో ప్రధాన అభ్యర్థులు....తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థులను అనునయించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంరూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో, పువ్వాడ అజయ్‌కుమార్‌ అర్బన్‌తహసీల్దార్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దాఖలైన పత్రాలన్నింటినీ 20వ తేదీన ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు.

మరిన్ని వార్తలు