బుజ్జగింపులు.. సంప్రదింపులు..

22 Nov, 2018 08:13 IST|Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రచారం హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు పదును పెడుతున్నాయి. పార్టీ టికెట్లు ఆశించి భంగపడి రెబెల్స్, స్వతంత్రులుగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. జిల్లాలో సీనియర్‌ నేతలు ఓ వైపు మంతనాలు జరుపుతూనే.. మరోవైపు హైదరాబాద్‌ పెద్దలతో ఫోన్‌లలో మాట్లాడిస్తున్నారు. పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తే ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులు ఇస్తామని సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ నెల 19న నామినేషన్ల ఘట్టం ముగియగా, పూర్వ కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి 296 మంది అభ్యర్థులు, 496 నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులతోపాటు అన్ని పార్టీల రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు అల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్, బీఎస్‌పీ తదితర పార్టీల తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నిర్వహించిన పరిశీలనలో 34 మంది నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కావడంతో పలుచోట్ల నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్, మహాకూటమిలకు రెబెల్స్‌ అభ్యర్థులతో ఆయా పార్టీల నేతలు రెండు రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల ఆఖరి నిమిషం వరకూ టికెట్‌ కోసం ఆశపడిన అభ్యర్థులు చాలాచోట్ల మహాకూటమికి తలనొప్పిలా మారుతున్నారు. దీంతో మహాకూటమికి రెబెల్స్‌ బెడద తప్పేలా లేదు. హుస్నాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి బీ–ఫారం వస్తుందని నామినేషన్‌ వేశారు. చివరి నిమిషంలో ఆ సీటును సీపీఐకి కేటాయించారు. దీంతో బీ–ఫారం జత చేయని కారణంగా ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఆయన మహాకూటమి ప్రచారానికి దూరంగా ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జువ్వాడి నర్సింగారావు ప్రచార జోరు పెంచగా, ఇక్కడ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి, ఆమె భర్త అయిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సహకరించే పరిస్థితి లేదు. వీరిని పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో హస్తం గుర్తు అభ్యర్థి విజరమణారావుకు పోటీగా ఇద్దరు నాయకులు సురేశ్‌రెడ్డి, ధర్మయ్య నామినేషన్లు వేశారు.

ఇందులో సురేశ్‌రెడ్డి నామపత్రం తిరస్కరణకు గురి కాగా, పోటీకి సై అంటున్న చేతి ధర్మయ్యను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎప్పటిలాగే కాంగ్రెస్‌ నుంచి అర డజను మంది టికెట్‌ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. పాడి కౌశిక్‌రెడ్డి, ముద్దసాని కశ్యప్‌రెడ్డి తదితరులు నామినేషన్‌ వేశారు. చివరి నిమిషంలో నామినేషన్ల చివరి రోజు కౌశిక్‌రెడ్డికి పార్టీ బీ–ఫారం ఇవ్వడంతో మిగతా వారు అసంతృప్తితో రగిలారు. తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్‌ సభలో గులాబీ తీర్థం పుచ్చుకోగా.. అనూహ్యంగా కశ్యప్‌రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడంతో ‘రెబెల్స్‌’ బెడద కౌశిక్‌రెడ్డికి తప్పింది. ఆ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఓటమికి గురైనా.. తిరిగి ధర్మపురి టికెట్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కే ఇవ్వడంపై అక్కడి నుంచి టికెట్‌ ఆశించిన మద్దెల రవీందర్, కవ్వంపెల్లి సత్యనారా>యణ తదితరులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వీటన్నింటినీ అధిగమించిన ఉప సంహరణల రోజున సమస్యలను అధిగమించి ప్రచారాన్ని హోరెత్తించేందుకు పార్టీ నేతలు వ్యూహం రూపొందిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు అక్కడక్కడా.. చీలిక ఓట్లకు అడ్డుకట్ట వేసే యత్నం..
పార్టీ టికెట్లు, గుర్తులు రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్న వారిని నిలువరించకపోతే ఓట్లు చీలే ప్రమాదం ఉందని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు అక్కడక్కడా రెబెల్స్‌ బెడద ఉన్నా.. ఓట్లు చీలికుండా అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొడిగె శోభ.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆమె సుమారు రెండు నెలలపాటు టికెట్‌ తనకే వస్తుందంటూ టీఆర్‌ఎస్‌ పక్షాన ప్రచారం చేశారు. చివరకు బీజేపీ నుంచి దిగుతున్నందునా అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓట్లకు చీలిక పడకుండా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. రామగుండంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మళ్లీ సోమారపు సత్యనారాయణ బరిలో ఉండగా.. అక్కడి నుంచి కోరుకంటి చందర్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు ఇస్తామని అధిష్టానం కోరుకంటి చందర్‌ను వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.

కోరుట్ల, జగిత్యాల నుంచి టీఆర్‌ఎస్‌ ఆశించిన జువ్వాడి నర్సింగారావు.. కోరుట్లలో తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాలలో డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కే మళ్లీ పార్టీ టికెట్‌ ఇచ్చారు. దీంతో పార్టీ మారిన నర్సింగారావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కోరుట్ల నుంచి బరిలో ఉన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేçస్తున్నారు. ఇదిలా వుండగా చాలా నియోజకవర్గాల్లో స్వతంత్రులు.. చిన్న పార్టీల అభ్యర్థుల పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలో కూడా నేతలు ఉన్నారు. 2014తో పోలిస్తే ఈసారి ప్రతీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగ్గా, 8 నుంచి 27 మంది వరకు నామినేషన్లు వేశారు.

నామినేషన్ల పరిశీలనలో మొత్తం 13 నియోజకవర్గాల్లో 34 తిరస్కరణకు గురి కాగా, ఉప సంహరణ తర్వాత కూడా 10 మందికి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిన్నా చితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులను బట్టి ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి నుంచి పది వేల వరకు ఓట్లు అటు ఇటూగా చీలితే.. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగే చోట గెలుపోటములు తారుమారయ్యే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కూడా కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థుల ఉపసంహరణకు చాలాచోట్ల ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. కాగా.. వీటన్నింటిపై గురువారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు