ముందస్తు నజర్‌

20 Sep, 2018 12:08 IST|Sakshi

సాక్షి, మెదక్‌: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ శాంతి భద్రతలపై దృష్టి సారించింది. ఎన్నికల్లో పోలీసుశాఖది కీలక పాత్ర. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది.  ఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో ప్రత్యేక అధికారుల బృందం ఎన్నికల బందోబస్తుకు ప్రణాళికను రెడీ చేస్తోంది. ఎన్నికల దృష్ట్యా పోలీసుశాఖ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోసం వినియోగించే ఈవీఎంలు జిల్లాలోని గోదాములకు చేరింది మొదలు పోలీసుల భద్రతా చర్యలు ప్రారంభమవుతాయి.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఈవీఎంలు పోలింగ్‌ కేంద్రాలకు భద్రంగా చేర్చడం, ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడం, పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలకు చేర్చే వరకు పోలీసుల అవసరమైన భద్రత కల్పిస్తారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండటంతో జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తమవుతున్నారు.  జిల్లాలో మెదక్, తూప్రాన్‌ రెండు పోలీసు సబ్‌డివిజన్ల పరిధిలో 20 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరితోపాటు ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక పోలీసు దళాలు  పాల్గొంటాయి. ఎన్నికల్లో ఎంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది అవసరం అవుతారో పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.
 
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు 
ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. రాబోయే అంసెబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 538 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతపరంగా అతి సమస్యాత్మక, సమస్యాత్మక, ప్రశాంతమైన పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు.

ఇందులో  107 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, 145 సమస్యాత్మక కేంద్రాలు,  286 పోలింగ్‌ కేంద్రాలు ప్రశాంతమైనవిగా గుర్తించారు. హవేళిఘణాపూర్‌ మండలంలో 10, శివ్వంపేటలో 10 పెద్దశంకరంపేటలో 11, టేక్మాల్‌లో 7, కొల్చారంలో 7 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అలాగే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు పెద్దశంకరంపేటలో 14, శివ్వంపేటలో 14, కోల్చారంలో 11 ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల సమయంలో అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై పోలీసు శాఖ నిఘా ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

రౌడీషీటర్ల, పాత నేరస్తులపై నజర్‌ 
ఎన్నికల నేపథ్యంలో  రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా ప్రారంభించారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారితోపాటు గత ఎన్నికల్లో బైండోవర్‌ అయిన వారికి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో ఆయుధాలు కలిగిన ఉన్నవారికి పోలీసుశాఖ వాటిని తమకు అప్పగించాలని నోటీసులు జారీ చేస్తోంది.

పోలీసు అధికారుల సమాచారం మేరకు మెదక్‌ జిల్లాలో గన్‌ లైసెన్స్‌ ఉన్న వారు 20 మంది ఉన్నారు. వీరి వద్ద 29 ఆయుధాలు ఉన్నాయి. వీరందరికీ ఆయుధాలు డిపాజిట్‌ చేయాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటి వరకు 8 మంది ఆయుధాలను సంబంధిత పోలీస్టేషన్లలో డిపాజిట్‌ చేశారు. మిగితా వారు త్వరలో ఆయుధాలు డిపాజిట్‌ చేయనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు