మిగిలింది ఒక్కరోజే..

18 Nov, 2018 08:16 IST|Sakshi

ఇన్నిరోజులు ఏ అసెంబ్లీ స్థానం ఎవరికి దక్కుతుందో తెలియక  ఆశావహులు అయోమయంలో పడ్డారు. ఇప్పుటికి స్పష్టత రావడంతో నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో అందరూ సోమవారానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నామినేషన్‌ వేసిన అభ్యర్థులు కూడా చివరి రోజు  కార్యకర్తలు, సానుభూతిపరులతో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు  రెండు నియోజకవర్గాల్లో  మొత్తం 27 నామినేషన్లు దాఖలయ్యాయి.

సాక్షి, మెదక్‌: నామినేషన్ల దాఖలకు ఇంకా ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. ఆదివారం సెలవుదినం కావడంతో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించడం లేదు. దీంతో నామినేషన్ల దాఖలుకు సోమవారం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. శనివారం మెదక్‌ నియోజకవర్గంలో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సాపూర్‌ నియోకజవర్గంపరిధిలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా చివరి రోజున ఊరిగింపులతో నామినేషన్లు వేసేందుకు ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. సోమవారం మంచి రోజు కావడంతో పద్మాదేవేందర్‌రెడ్డి మరోసెట్‌ నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

సోమవారం పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.   కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య కూడా చివరి రోజున మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డి చివరి రోజున మరోసెట్‌ నామినేషన్‌ వేయనున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. నర్సాపూర్‌ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో పార్టీ టికెట్‌ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

స్నేహపూర్వక పోటీపై సడలుతున్న ఆశలు 
మెదక్‌ నియోజకవర్గంలో స్నేహపూర్వక పోటీపై కాంగ్రెస్‌ ఆశావహుల్లో క్రమంగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. తెలంగాణ జన సమితి ఇది వరకే మెదక్‌ నుంచి తమ పార్టీ పోటీచేస్తున్నట్లు ప్రకటించింది. పొత్తులో భాగంగా మెదక్‌ తమకే దక్కుతుందని ఆ పార్టీ స్పష్టంగా చెబుతుంది. అయితే మెదక్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు ఇంకా టికెట్‌ కోసం చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. శనివారం 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మెదక్‌ ఉంటుందని   కాంగ్రెస్‌ నేతలు ఆశించారు.

అయితే మెదక్‌ పేరు లేకపోవటంతో నిరాశకు గురయ్యారు.  అలాగే కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ చేసేందుకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో మెదక్‌ నుంచి ఈ రకమైన పోటీ కోసం కాంగ్రెస్‌ ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్‌ నుంచి పోటీ చేసేందుకు తనకు ఆవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర నాయకులను కోరినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నాయకులు బట్టి జగపతి, బాలకృష్ణ తదితరులు మాజీ ఎంపీ విజయశాంతి ద్వారా  చివరి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు