ముగిసిన ఓటరు నమోద

10 Nov, 2018 11:19 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం గత నెల 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఓటరు నమోదు కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఉప ఎన్నికల అధికారి జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డిలు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.  అనుకున్న విధంగానే చాలావరకు యువ ఓటర్లు ఆసక్తిచూపారు. పాత జాబితా తర్వాత రెండో తుది జాబితాతో పోలిస్తే జిల్లాలో సుమారు 50వేల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

గత నెల 12న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా నాటి నుంచి శుక్రవారం వరకు ఓటు నమోదు చేసుకునేందుకు తిరిగి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లోనూ యువత దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దీంతో శుక్రవారం వరకు జిల్లావ్యాప్తంగా 6 నియోజకవర్గాల పరిధిలో 16,302 దరఖాస్తులు వచ్చాయి.

కొత్తగా వచ్చిన దరఖాస్తులను బట్టి జిల్లాలో అదనంగా 16,302 మంది ఓటర్లు కొత్తగా అదనపు జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇంకా రాత్రి వరకు ఆన్‌లైన్‌లో వస్తే అధికారులు వాటిని కూడా అధికారులు పరిశీలించి అదనపు జాబితాలో చేర్చనున్నారు. మొత్తానికి కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను అన్నింటినీ అధికారులు పరిశీలించి ఈ నెల 19న అదనపు ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు