పోటెత్తాయ్‌...

26 Sep, 2018 08:56 IST|Sakshi
నోడల్‌ అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : కొత్త ఓటర్లుగా నమోదు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన గడువు మంగళవారం ముగిసింది. షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి అధికారులు విశేష ప్రచారం చేసినా అంతంత మాత్రంగానే స్పందంగా ఉండగా.. చివరి రోజు మాత్రం దరఖాస్తుదారులు అనూహ్యమైన స్పందన వచ్చింది. నిర్ణీత గడువులోపు మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 వేలకు పైగా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయి తే చివరిరోజు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో ఒక్కసారిగా రావడంతో సర్వర్‌ సమస్య తలెత్తింది. ఫలితంగా కేంద్రాలు కిటకిటలాడగా సర్వర్‌ బిజీగా మారింది. దీంతో చాలా మంది కొత్త ఓటర్లు దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అయితే, చాలా మంది స్వయంగా దరఖాస్తులు సమర్పించగా.. చేర్పులు, మార్పుల కోసం పెద్దసంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి.

ఈనెల 10నుంచి  
ఓటరు జాబితాలో పేరు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులతో పాటు, అభ్యంతరాల నమోదుకు ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని స్కూళ్లు, కాలేజీలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా బూత్‌ల్లో బీఎల్‌ఓలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. స్వయంగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ వాటిని గడువులోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని తెలుస్తోంది. మ్యాన్యువల్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించే విషయంలో స్పష్టత రా లేదు. కాగా కొన్ని చోట్ల ఓటరు నమోదు దరఖాస్తులు ఫారం–6 అందుబాటులో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమైంది.
 
ఏర్పాట్లలో అధికార యంత్రాంగం 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార యం త్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా యం త్రాంగం నిత్యం సమావేశాలు, ఓటరు నమోదు క్యాంపెయిన్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్‌ మంగళవారంతో ముగియడంతో జిల్లా అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ నోడల్‌ అధికారులను నియమించారు. ఈ సందర్భంగా వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నందున సమర్దవంతంగా విధులు నిర్వహించేందుకు సిద్దం కావాలని సూచించారు.
 
కాల్‌సెంటర్‌ ద్వారా సందేహాల నివృత్తి 
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగం, కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఓటరు జాబితాలో పేర్లు, ఇతర సందేహాల నివృత్తి చేసుకునేందుకు కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబర్‌ 08542–241165, టోల్‌ఫ్రీ నంబర్‌ 180018011950 కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే వెసలుబాటు కల్పించారు.
 
ఎన్నికల మూడ్‌లోకి.. 
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గత 20 రోజులుగా జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ నెల 10వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసిన అనంతరం జిల్లా యంత్రాంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పాత ఈవీఎంలను పంపించగా, ఈనెల 18న ఎన్నికల కమిషన్‌ నుండి జిల్లాకు కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్‌లు వచ్చాయి. వీటికి ఫస్ట్‌లెవెల్‌ చెకింగ్‌తో పాటు రాజకీయ పార్టీలకు æపనితీరుపై అవగాహన కల్పించారు. ఈ నెల 10 నుండి మంగళవారం వరకు ఓటరు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టగా.. నిత్యం సమావేశాలను నిర్వహిస్తూ అధికారులకు ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు.
 
నోడల్‌ ఆఫీసర్ల నియామకం 
ఎన్నికల విధులు సమర్దవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ నోడల్‌ ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నందున సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల నిర్వహణపై శిక్షణను ప్రతీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నోడల్‌ ఆఫీసర్లకు సూచించారు. ఈనెల 26న ఉదయం మహబూబ్‌నగర్‌లో, మధ్యాహ్నం జడ్చర్ల, 27న ఉదయం దేవరకద్ర, మధ్యాహ్నం నారాయణపేట, 28న ఉదయం మరికల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. నోడల్‌ అధికారులు సిబ్బందితో సమన్వ యం చేసుకుంటూ విధులు సమర్దవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. జేసీ వెంక ట్రావు, వివిధ అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు