ముందడుగు

11 Sep, 2018 09:30 IST|Sakshi
అధికారులు, నాయకులతో ఏర్పాటుచేసిన సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : శాసనసభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. పలు సమీక్షల ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే ఓ వైపు ఓటర్ల జాబితాల రూపకల్పనకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేయడంతో పాటు నిర్దేశించిన షెడ్యూల్‌ మేరకు అక్టోబర్‌ 8న తుది జాబితాలను విడుదల చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది.

పెరిగిన ఓటర్లు 
ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 9,66,615 మంది ఓటర్లు నమోదయ్యారు. అందులో 4,85,912 మంది పురుషులు, 4,80,619 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 84 మంది ఉన్నారు. కాగా జిల్లాలో గతంలో విడుదల చేసిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌–2018 ఫైనల్‌ ఓటర్ల జాబితాతో పోలిస్తే తాజా ముసాయిదా జాబితాలో 35,158 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.

ఇందులో 18,669 మంది పురుష ఓటర్లు, 16,481 మంది మహిళా ఓ టర్లతో పాటు ఇతరులు  8 మంది నమోదయ్యా రు. కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. అక్టోబర్‌ 4న అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్‌ 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని రె వెన్యూ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ ధికారులతో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమీక్షించారు. ఎ న్నికల కమిషన్‌ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఈ సందర్బంగా సూచించారు. ఓటర్ల జాబితాల ప్యూరిఫికేషన్‌కు రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలని అధికారులకు సూ చించారు. ఓటర్ల జాబితాలపై రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల అభిప్రాయాలు సేకరించారు.
 
తప్పులు దొర్లితే చర్యలు 
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పక్కాగా నమోదు చేసే ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అధికారులకు సూచించారు. చనిపోయిన ఓటర్లు, చేర్పులు, మార్పులపై ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. తుది ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లినా సంబంధిత బీఎల్‌ఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ నియమ నిబందనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం నడుచుకోవాలని సూచించారు.  

జిల్లాలో 1,312 పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో మొత్తం 1312 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. గతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల కంటే 122 పోలింగ్‌ కేంద్రాలను కొత్తగా ఏర్పాటుచేశామన్నారు. ఈసారి ఎన్నికల్లో వీవీపీఏటీ యంత్రాల వాడకానికి ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఓటర్లు అపోహలకు గురికాకుండా ఈ విధానంపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 

ఈ సారి జరిగే ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోందని, అందుకోసం ఎన్నికల్లో ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించనున్నట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. అందుకోసం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గతంలో ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో వినియోగించిన  పాత ఈవీఎంలను తిరిగి పంపించాలన్న ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ తర్వాత కొత్త ఏవీఎంలను పంపించనుండగా.. బెంగళూరు నుండి ఈనెల 15న జిల్లాకు చేరుకుంటాయని తెలిపారు. 

ఎం–3 ఈవీఎంల వినియోగం  

మరిన్ని వార్తలు