ఎన్నికల బదిలీలు

12 Oct, 2018 11:53 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : ఎన్నికల బదిలీలకు జిల్లాలో రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే జిల్లా పరిధిలో మూడు సంవత్సరాల సర్వీసు దాటిన అధికారులను విధిగా బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కూడా ఎన్నికల సమయంలో అదే జిల్లాలో ఉండనీయరాదని తేల్చిచెప్పింది. దీంతో జిల్లాలో రెవెన్యూ, పోలీసు అధికారుల బదిలీలకు రంగం సిద్ధ్దమైంది. 

9మంది తహసీల్దార్లకు స్థానచలనం
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తహసీల్దార్ల బదిలీ ప్రక్రియను ఉన్నతాధికారులు చేపట్టారు. ఎన్నికల నిబంధనల పరిధిలోకి వస్తున్న తొమ్మిది మంది తహసీల్దార్లను జిల్లా నుంచి బదిలీ చేసేందుకు ఏర్పాట్లు  చేశారు. వచ్చే నవంబర్‌ 30 నాటికి ఒకే జిల్లా పరిధిలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యలో ఉన్నతాధికారులు బదిలీ  జాబితా రూపొంది ంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, ఓదెల, రామగుండం, రామగిరి, ఎలిగేడు, ముత్తారం, ధర్మారం తహసీల్దార్లు బదిలీ కానున్నారు. ఇందులో రామగిరి, ఎలిగేడు, ముత్తారం తహసీల్దార్లు జిల్లా వాసులే కావడంతో వారిని బదిలీ చేస్తున్నట్లు సమాచారం.

మిగిలిన ఆరుగురు జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. దీంతో వారి బదిలీ తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే బదిలీ ప్రక్రియ సిద్ధం కాగా శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కలెక్టర్‌ దేవసేన, జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవీలు బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా దాటలేదు. పెద్దపల్లి, మంథని ఆర్‌డీఓలు ఇటీవలనే బాధ్యతలు చేపట్టారు.  దీనితో ఎన్నికల బదిలీల్లో ఉన్నతాధికారులు లేరు.

పోలీసు విభాగంలో...
రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు విభాగంలోనూ ఎన్నికల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో నెల క్రితమే పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి.మూడు సంవత్సరాల పై బడి సర్వీసు పూర్తయిన పోలీసు అధికారుల బదిలీను ముందుగానే చేపట్టారు. గోదావరిఖని టూటౌన్‌ సీఐగా ఉన్న చిలుకూరి వెంకటేశ్వర్లును ఎస్‌బీకి బదిలీ చేయగా, ఆయన స్థానంలో జి.వెంకటేశ్వర్లుకు పోస్టింగ్‌ ఇచ్చారు. వీరితో పాటు మరో ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేశారు.

కాగా ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబధం ఉన్న సబ్‌ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, డీఎస్‌పీలు, అదనపు ఎస్‌పీలు, ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలున్నాయి. జిల్లాలో ఆ నిబంధనల ప్రకారమే పోలీసుల బదిలీలు చేపట్టారు. ప్రధానంగా లా అండ్‌ ఆర్డర్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారులకే ఈ ఎన్నికల సంఘం నిబంధన వర్తిస్తుండడంతో, అలాంటి వారిని ముందుగానే గుర్తించి లూప్‌లైన్‌లకు పంపించారు. కాగా నెల రోజుల క్రితమే జిల్లాలో బదిలీలు పూర్తి కావడంతో, తాజాగా బదిలీలు ఉండకపోవచ్చని పోలీసు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు