సర్వే గుబులు! 

22 Sep, 2018 11:24 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌లో కూడా సర్వే.. గుబులు రేపుతోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు సర్వే చేపట్టారు. ఇప్పుడు మరోసారి సర్వే చేయిస్తుండగా.. కాంగ్రెస్‌ కూడా కూటమిలో సీట్ల సర్దుబాటు, ఆశావహుల శక్తియుక్తులపై సర్వే నిర్వహిస్తోంది. ఎన్నికల వాతావరణం ప్రారంభానికి ముందునుంచే వివిధ పార్టీలు క్షేత్రస్థాయిలో సర్వేలు చేపడుతూ వస్తున్నాయి. సర్వేలో తెలుసుకున్న వివరాలతో పాటు స్థానిక పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్లేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. 9 నెలల ముందే శాసనసభ రద్దు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ, మరుక్షణమే అభ్యర్థులను సైతం ప్రకటించింది. అప్పటికే అనేక విడతలుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పలుమార్లు సర్వేలు చేయించుకున్నారు.  అన్ని అంశాలను బేరీజు వేసుకుని సిట్టింగులకే టికెట్లు కేటాయించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనతో ఇతర జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అసమ్మతి రాగాలు పెద్దఎత్తున ఎగిశాయి.

టికెట్లు ఆశించిన ఇతర నాయకులతో పాటు, పార్టీ కేడర్‌ నుంచి తీవ్ర అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిట్టింగ్‌లను కాదని వేరేవాళ్లకు టికెట్లు ఇస్తే ఈ అసమ్మతి మరింత భారీగా ఉండేదని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావించినట్లు పలువురు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మరోవైపు ఓటర్ల ఆలోచనాసరళి సైతం మారిపోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసిన టీఆర్‌ఎస్‌ సైతం మారుతున్న పరిస్థితులు, ప్రజల నాడి పట్టుకునేందుకు సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క కొత్తగూడెం మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. అశ్వారావుపేట, పినపాక నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ తరఫున 

ఇల్లెందు నుంచి గెలిచిన కోరం కనకయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సహజంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, సిట్టింగ్‌లు కావడంతో ప్రజల్లో వీళ్లపైనా వ్యతిరేకత బాగానే ఉంది. అసమ్మతులు ఇప్పటికీ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ మళ్లీ సర్వేలు చేయిస్తుండడంతో అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. జిల్లా టీఆర్‌ఎస్‌లో భద్రాచలం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో రగులుతున్న అసమ్మతులతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు ఎలాంటివారు బరిలోకి రానున్నారో అనే టెన్షన్‌ సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను వెంటాడుతోంది. 

సీట్ల సర్దుబాటు, ఆశావహుల వివరాలపై కాంగ్రెస్‌ సర్వే.. 
ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకకటించడంతో సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌తో కూటమి కట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రతి ఒక్క స్థానంపై పట్టుదలగా ముందుకు కదులుతోంది. భద్రాద్రి జిల్లాలో సీపీఐ, టీడీపీలకు తప్పనిసరిగా సీట్లు సర్దుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉండడంతో అందుకు సంబంధించి ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో, కాంగ్రెస్‌కు వచ్చే సీట్లలో పోటీపడుతున్న ఆశావహుల గుణగణాలు, బలాబలాలు తదితర వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కోసం భద్రాచలం మినహా ఇతర స్థానాల్లో గట్టి పోటీ ఉంది. మరోవైపు భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల కేటాయింపు తరువాత తలెత్తే అసమ్మతుల అంశాలపై సైతం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో అభ్యర్ధుల ప్రకటన తరువాత ఊహించని స్థాయిలో అసమ్మతి భగ్గుమంటోంది. ఇక అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో ఈ అసమ్మతి గ్రూపుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండడంతో అన్ని అంశాలను క్రోడీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇల్లెందు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రమైన పోటీ ఉంది. కొత్తగూడెంలోనూ వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉంది. ఇక అశ్వారావుపేట టికెట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీకి కేటాయించొద్దని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. టీడీపీకి కేటాయిస్తే వ్యతిరేకిస్తామని కేడర్‌ పేర్కొంటోంది. కొత్తగూడెం స్థానం కోసం సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. ఈ సీటు విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని చెబుతోంది. ఇలాంటి అంశాలపైనా కాంగ్రెస్‌ పార్టీ సర్వే చేస్తోంది. మండలాలు, గ్రామాలవారీగా క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థల ప్రకటన తరువాత చెలరేగిన అసమ్మతుల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత జాగ్రత్తగా వ్యవహరించే ఉద్దేశంతో పక్కాగా సర్వే చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ కూటమిలో ఉన్న టీడీపీ తాము గట్టిగా కోరుతున్న స్థానాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వేలు చేసుకుంటోంది. జిల్లాలో అశ్వారావుపేట, భద్రాచలం స్థానాలను టీడీపీ గట్టిగా కోరుతోంది. కాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టికెట్ల కోసం రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

అన్ని చోట్లా గట్టి అభ్యర్థుల కోసం చూస్తున్న బీజేపీ 
జరగబోయే ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ కావాలని చూస్తున్న బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై గట్టిగానే దృష్టి పెట్టింది. గతంలో జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాల్లో బీజేపీ పరిచయం కూడా తక్కువగా ఉండేది. రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెంచుకోవడంతో పాటు ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకునేందుకు బీజేపీ పట్టుదలతో ఉంది. దీంతో అన్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. జిల్లా ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ఇన్‌చార్జిగా జాతీయ నాయకత్వంతో అనుబంధం ఎక్కువగా సారంగుల అమరనాథ్‌ను నియమించింది. పినపాక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీ భారీగానే ఓట్లు సాధించింది. దీంతో బీజేపీ సైతం ప్రజల నోళ్లలో నానుతోంది. ఈ క్రమంలో జాతీయ నాయకత్వం ప్రణాళికల మేరకు వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను వెతికే పనిలో భాగంగా సర్వేలు చేయిస్తోంది. ఈసారి బీజేపీ టికెట్ల కోసం సైతం పోటీ పెరుగుతుండడంతో ఈ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.  


 

మరిన్ని వార్తలు