ఎవరి సీటుకో ఎసరు..!

8 Sep, 2018 10:50 IST|Sakshi

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పొత్తులతో ముందుకు సాగాలనే నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సూచన మేరకు సీపీఐ, తెలంగాణ సమితి (టీజేఎస్‌)తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తదితరులు చర్చలు జరిపారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉత్తమ్‌ భేటీ కానున్నారు. ఈ మేరకు టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్‌ ఎల్‌.రమణ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమాచారం కూడా అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు మినహా..

కలిసొచ్చే పార్టీలతో ‘మహాకూటమి’గా కాంగ్రెస్‌ బరిలోకి దిగనుందని అవగతం అవుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పొత్తులు కుదిరితే మూడు, లేదా నాలుగు స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుండగా.. ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ పార్టీ నుంచి అవకాశం లభిస్తుంది? మరెవరికి ఛాన్స్‌ మిస్సవుతుందన్న తర్జనభర్జనలు జోరందుకున్నాయి.
– సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : ముందస్తు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో ఉన్న కాంగ్రెస్‌.. రాష్ట్రస్థాయిలో ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌ తదితర పార్టీలను కలుపుకునేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో పొత్తుకు టీడీపీ నేతలు కూడా సానుకూలంగా స్పందించగా, శనివారం చర్చలతో కొలిక్కి రానుంది. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లపై కూడా ఓ నిర్ణయానికి వస్తారన్న ప్రచారం జరుగుతుండగా, తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్‌లో సీట్ల సర్దుబాటు సమస్య అవుతుందన్న చర్చ కూడా పార్టీల్లో జరుగుతోంది.

ఇదిలా వుండగా పొత్తుల్లో భాగంగా హుజూరాబాద్‌ నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కోరుట్ల నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా దాదాపుగా తెలంగాణలో సీపీఐ కేటాయించే ఒకటి, రెండు స్థానాల్లో హుస్నాబాద్‌ ఉంటుంది. ఈ స్థానంపై సీపీఐ కన్నేసింది. సీపీఐతో ఇదివరకే కాంగ్రెస్‌ చర్చలు జరిపింది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఆ సీటు ఖాయమనే అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ జన సమితితో కూడా కలిసి నడవాలనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ జిల్లాలో టికెట్‌ అడుగుతుందా? లేదా..? ఒకవేళ అడిగితే, ఎక్కడ అడుగుతారు? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీజేఎస్‌ కూడా ఒక స్థానం తప్పనిసరి అంటే.. కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 9 స్థానాలే మిగలనున్నాయి.   

చివరికి ఎవరి సీటుకో ఎసరు..
జగిత్యాల, మంథని మినహా అన్ని స్థానాల్లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబులే మళ్లీ పోటీ చేయనుండగా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యం, సీహెచ్‌ విజయ రమణారావు, కవ్వంపెల్లి సత్యనారాయణ చొప్పదండి, పెద్దపల్లి, మానకొండూరు నియోజకవర్గాలపై కన్నేశారు. మానకొండూరు మాజీ విప్‌ ఆరెపెల్లి మోహన్‌కు ఖాయమంటుండగా కవ్వంపెల్లి సత్యనారాయణ కూడా లైన్లో ఉన్నానంటున్నారు. చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతంతోపాటు మేడిపల్లి సత్యం ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు.

పెద్దపల్లి నుంచి గొట్టి్టముక్కుల సురేష్‌రెడ్డి, సీహెచ్‌ విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు డాక్టర్‌ గీట్ల సవిత, ఈర్ల కొంరయ్య టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. రామగుండం, వేములవాడ, సిరిసిల్ల, కోరుట్ల నుంచి కూడా ఇద్దరు, ముగ్గురు, నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ధర్మపురి నుంచి అడ్లూరు లక్ష్మణ్‌కుమారే అంటున్నా.. మద్దెల రవీందర్‌ కూడా ఏఐసీసీ, టీపీసీసీలకు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా వుంటే పొత్తుల్లో భాగంగా టీడీపీకి రెండు, సీపీఐకి ఒక స్థానం కేటాయించాల్సి రావడంతో మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ నేతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. టీజేఎస్‌కు సైతం ఓ సీటు ఇవ్వాల్సి వస్తే నాలుగు స్థానాలను వదలాల్సిందే. ఇప్పుడు టీటీడీపీలో కీలకంగా ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్‌.రమణ కోసం హుజూరాబాద్‌తోపాటు కోరుట్లలో టీడీపీ డిమాండ్‌ చేయనుంది.

హుస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించడం అనివార్యం కాగా, చాడ వెంకటరెడ్డికే అవకాశం ఉంది. అప్పుడు హుజూరాబాద్‌ టీడీపీ(పెద్దిరెడ్డి)కి ఇవ్వక తప్పని పరిస్థితి. దీంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి ఆశలు అడియాసలే. హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి కూడా కాంగ్రెస్‌ టిక్కెట్‌ చేజారినట్లే. ఎల్‌.రమణ కోరుట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైతే ఇక్కడ టిక్కెట్‌ ఆశించే కొమిరెడ్డి రామ్‌లు సహా మరో ముగ్గురికి కూడా నిరాశే కలగనుంది. కాగా.. పొత్తుల వ్యవహారం నేడు కొలిక్కి రానుండగా, ఈనెల 15 నాటికి సీట్లు, టిక్కెట్ల కేటాయింపుపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

హెల్త్‌కు లేని వెల్త్‌

రైతే రాజు

భద్రతకు రూ. 4,540 కోట్లు

నిరుద్యోగ భృతికి 1,810 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దర్శక దిగ్విజయుడు

కోడి రామకృష్ణ ఇకలేరు

ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్‌

నివాళి

అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్‌ అయింది

‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ మూవీ రివ్యూ