అటెన్షన్‌..! 

7 Sep, 2018 13:54 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : ఇప్పటికే జిల్లాలో ఎన్నికల వేడి రగిలింది. గత కొన్ని నెలలుగా ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి. ప్రజాసమస్యలపై పలు దశల్లో  పోరాటాలు చేస్తున్నాయి. గతంలో వామపక్షాలకే పరిమితమైన పోడుభూముల పోరాటాన్ని కాంగ్రెస్‌ తదితర పార్టీలు సైతం చేపట్టాయి. దీంతో ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ఇక అందరూ ఊహించినట్లుగానే 9 నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభను రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో హైటెన్షన్‌ నెలకొంది.

ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు పోటీచేసే వారి పేర్లు వెలువడ్డాయి. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అప్పుడే హడావిడి మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు సిట్టింగ్‌లకు టికెట్లు రాగా, భద్రాచలం స్థానంలో తెల్లం వెంకట్రావుకు టికెట్‌ దక్కింది.

దీంతో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. అనేక చోట్ల ర్యాలీలు నిర్వహిస్తూ, బాణసంచా కాలుస్తూ జోష్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేసిన టీఆర్‌ఎస్‌.. శుక్రవారం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ సభ ద్వారా సమరశంఖం పూరించనుంది. దీంతో జిల్లాలోనూ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయికి దూసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మకాం వేసిన విపక్ష నేతలు.. 
శాసనసభ రద్దు చేసిన మరుక్షణమే కేసీఆర్‌ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లకూ అభ్యర్థుల పేర్లు వెల్లడించడంతో విపక్షాల్లో మరింత హడావిడి మొదలైంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఆ కూటమిలో సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ పార్టీలు చేరే విషయం ఖాయం కావడంతో పాటు సీపీఎంను సైతం కలుపుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయం కొంత క్లిష్టతరం కానుంది. దీంతో ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించే ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మకాం వేసి తమ తమ స్థాయిల్లో తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఏ పార్టీకి ఏ స్థానాలు ఇస్తారు.. తమకు టికెట్లు వస్తాయా, రావా అనే గందరగోళంలో ఉన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఉన్న కాంగ్రెస్‌ సీపీఎంను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఆ పార్టీ మాత్రం బీఎల్‌ఎఫ్‌(బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌) పేరుతో ఎన్నికలకు వెళతామని గట్టిగా చెబుతోంది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సీపీఎం గుర్తుపై, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో బీఎల్‌ఎఫ్‌ గుర్తుతో పోటీ చేసేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. ఇక దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు బూత్‌స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కొందరు తమకు టికెట్లు దక్కకపోతే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట శాసనసభ స్థా«నాల్లో గెలుపొందిన వైఎస్సార్‌సీపీ ఈసారి భద్రాద్రి జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. భద్రాద్రి జిల్లాలో అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ బలంగా ఉండగా, కాంగ్రెస్‌ కూటమిలో చేరనున్న టీడీపీ, సీపీఐ సైతం గణనీయమైన బలం కలిగి ఉన్నాయి. టీజేఎస్‌ సైతం కొంతమేరకు ప్రభావం పెంచుకుంటోంది. ఇక బీఎల్‌ఎఫ్‌ పేరుతో సీపీఎం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండగా, బీజేపీ, వైఎస్సార్‌సీపీ విడివిడిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లాలో బహుముఖ పోటీ జరుగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

మరిన్ని వార్తలు