అమీ.. తుమీ...!

30 Nov, 2018 09:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ముందస్తు ఎన్నికల సంగ్రామానికి వారం రోజుల గడువే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఈ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గల అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే కార్యక్రమం ఇప్పటికే పూర్తికాగా, ఇప్పుడు ప్రధానంగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అదే సమయంలో రాష్ట్రంలో ఇమేజ్‌ ఉన్న పార్టీ నేతలను, ఇతర నాయకులను నియోజకవర్గాలకు ఆహ్వానించి సభలు, సమావేశాలతో ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసిన అభ్యర్థులు వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. బస్తీలు, గ్రామాల నాయకులు డబ్బులు, మద్యం పంచేందుకు  సమాయాత్తమవుతున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు కేసీఆర్, అమిత్‌షా, మాయావతి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి తదితరులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిపోగా, ప్రచారానికి మిగిలిన ఐదు రోజుల్లో హేమాహేమీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , విజయశాంతి, గద్దర్, కోదండరాం తూర్పు జిల్లాల్లో పర్యటించనున్నారు.

సీఎం సభలతో టీఆర్‌ఎస్‌లో  కొత్త ఉత్సాహం 
విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటనలు జరుపుతుండడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వివిధ కారణాలతో తొలుత బలహీనంగా కనిపించిన నియోజకవర్గాల్లో సైతం ఇప్పు డు పరిస్థితులు మారడం గమనార్హం. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలల్లో సీఎం పర్యటనల తరువాత ఆ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్‌లలో బీజేపీ బలమైన అభ్యర్థులు ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్‌ఎస్‌కు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి పాల్గొన్న సభలన్నీ విజయవంతం కాగా, అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగినట్లయింది. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే కాంగ్రెస్, టీడీపీ వల్ల ప్రజలకు నష్టం జరిగే తీరును వివరించి ఆకట్టుకున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి చేసిన కృషిని వివరించి వారిని ఆకట్టుకున్నారు.

కాంగ్రెస్‌ నేతల చూపు పీసీసీ వైపు 
టీఆర్‌ఎస్‌కు బెల్లంపల్లి మినహా తొమ్మిది స్థానాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నప్పటికీ, స్టార్‌ క్యాంపెయినర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు ఉమ్మడి జిల్లాను చుట్టిరాగా, కాంగ్రెస్‌ తరుపున ఆ పరిస్థితి లేదు. అభ్యర్థుల ఎంపికకు ముందు రాహుల్‌గాంధీ భైంసాలో నిర్వహించిన సభ, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌లలో భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి సభలు మాత్రమే జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విజయశాంతి, మందకృష్ణ మాదిగ, గద్దర్‌ శుక్రవారం మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లితో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వీరి పర్యటన తరువాత కాంగ్రెస్‌లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరిసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. మంచిర్యాలలో సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు భారీ ఏర్పాట్లు చేశారు.

ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బెల్లంపల్లి మినహా ప్రధాన పార్టీల మధ్యనే పోరు నెలకొంది. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎవరు ఎవరిని ఓడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పశ్చిమ జిల్లాలో బీజేపీ ప్రభావం ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్‌లో ఎక్కువగా ఉండగా, తూర్పు ప్రాంతంలో బెల్లంపల్లి, మంచిర్యాలలో కనిపిస్తోంది. బెల్లంపల్లి మినహా నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొనే పరిస్థితులున్నాయి. బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్‌ (బీఎస్‌పీ), గుండ మల్లేష్‌ (సీపీఐ), కొయ్యల ఏమాజీ (బీజేపీ) మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మిగతా ఐదుచోట్ల బీజేపీ బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే ఉంది. కాగా బీజేపీ చీఫ్‌ అమిత్‌షా నిర్మ ల్, ఆదిలాబాద్‌లలో ప్రచారసభలు నిర్వహించి ఆ పార్టీ అభ్యర్థులకు మనోధైర్యం ఇచ్చారు. మరో విడత స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం ఉంటుందని ఆపార్టీ అభ్యర్థులు ఆశతో ఉన్నారు.

మాయావతి ప్రభావంతో ఏనుగు  ఎక్కుతారా..?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్‌పీ రాష్ట్రంలో గత ఐదు ఎన్నికల నుంచి పోటీ చేస్తున్నా, 2014లో నిర్మల్, సిర్పూరు గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. గెలిచిన అభ్యర్థులు తరువాత టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, ఆ పార్టీకి ఆదిలాబాద్‌లో ఇమేజ్‌ కొంత మేర ఉందనేది వాస్తవం. అదే స్ఫూర్తితో ఈసారి బీఎస్‌పీ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగారు. అంగబలం, అర్థబలం కలిగిన మాజీ మంత్రి గడ్డం వినోద్‌ ఇప్పుడు ఆ పార్టీకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. బెల్లంపల్లిలో మహాకూటమి నుంచి సీపీఐ పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు, టీఆర్‌ఎస్‌ అసంతృప్తి వాదులు వినోద్‌కు బాహాటంగా మద్దతిస్తున్నాయి.

దాంతో పోటీ టీఆర్‌ఎస్, బీఎస్‌పీ మధ్యనే అన్నట్లుగా సాగుతోంది. చెన్నూరులో బీఎస్‌పీ అభ్యర్థిగా ప్రొఫెసర్‌ సుజాత పోటీ చేస్తున్నారు. వామపక్ష భావాలు గల సుజాత ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఏమేర పోటీ ఇస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో గెలిచిన సిర్పూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనప్ప బంధువు రావి శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. మంచిర్యాలలో బేర సత్యనారాయణ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. వీరంతా పోటీలో కనిపిస్తున్నప్పటికీ, గెలుపు గుర్రంగా గడ్డం వినోద్‌ మాత్రమే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మల్, మంచిర్యాలలో మాయావతి ప్రచార సభలు నిర్వహించడం కొంత మేరకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రామారావు పటేల్‌కు ఇబ్బందిగా మారింది. చెన్నూరులో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ ప్రభావం ఎంతో తెలియని పరిస్థితి. ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపడం లేదు.

మరిన్ని వార్తలు